‘అర్నబ్’ తుఫాను ప్రభావంతో అక్టోబర్ 27 నుంచి వర్షాల కురుస్తాయని వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో సిటీ జనాలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సిటీతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో నాన్-స్టాప్ ముసురు లేదా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందనడంతో ఎల్నినో ఎఫెక్ట్ తగ్గుతుందని అనుకుంటున్నారు. కానీ, వర్షం 2 నుంచి 5 సెం.మీ వరకే పడొచ్చని, దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదని నిపుణులు చెప్తున్నారు.
ఈ వర్షం డ్రైనేజీలు, నాలాల్లో కొట్టుకుపోతుందని, భూమిలోకి ఇంకడానికి, లేదా భూగర్భ జలాలు పెరిగి లోటును తగ్గించే ఛాన్స్ లేదంటున్నారు. తుఫాను తూర్పు వైపు కేంద్రీకృతమై ఉండటం వల్ల రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు వచ్చే అవకాశం లేదంటున్నారు. కేవలం పొడి వాతావరణం నుంచి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుందని చెప్తున్నారు.
ఎల్నినో సిటీపై పంజా విసిరింది. దీని ఎఫెక్ట్ ఎంతలా ఉందంటే గత పదేం డ్లలో క్యూర్ పరిధిలో ఎన్నడూ లేనంత లోటు వర్షపాతం నమోదైంది. అక్టోబర్ నాటికి సాధారణం కంటే చాలా తక్కువ నమోదు కావడంతో గ్రౌండ్ వాటర్ దారుణంగా పడిపోతున్నది. గతేడాది సిటీలో ఫుల్లు వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండగా.. ఈ సారి వర్షాలు లేక విలవిల్లాడాల్సిన పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్ జిల్లాలో అక్టోబర్ 2 నాటికి 72.57 సెం.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 45.85 సెం.మీ మాత్రమే పడింది. ఇది 37 శాతం లోటు కాగా, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో ఏకంగా 41 శాతం, రంగారెడ్డి జిల్లాలో 25 శాతం లోటు నమోదైంది. అక్టోబర్ 27 నుంచి ఆర్నబ్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించినా.. దీనితో పెద్దగా ఒరిగేది లేదని నిపుణులు చెప్తున్నారు.
