ఏపీకి తుపాను గండం! ..140 కి.మీ. వేగంతో ఈదురుగాలులు..ఎల్లుండి( అక్టోబర్ 28న) తీరం దాటే చాన్స్‌‌‌‌

ఏపీకి తుపాను గండం! ..140 కి.మీ. వేగంతో ఈదురుగాలులు..ఎల్లుండి( అక్టోబర్ 28న) తీరం దాటే చాన్స్‌‌‌‌
  • మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచన

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాల‌‌‌‌కు తుపాను ముప్పు పొంచివున్నద‌‌‌‌ని భార‌‌‌‌త వాతావ‌‌‌‌ర‌‌‌‌ణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా, ఆపై సైక్లోన్​గా మారి తీరంవైపు దూసుకొస్తోంద‌‌‌‌ని హెచ్చరించింది. ఈ తుపానుకు బంగ్లాదేశ్ సూచించిన ‘అర్ణబ్’ అనే పేరు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ, తూర్పు తీరప్రాంతాల్లో హై అలర్ట్​ ప్రకటించింది. 

ఈ నెల 28న మధ్యాహ్నానికి ఏపీలోని బాపట్ల, విశాఖపట్నం మధ్య (యానాం సమీపంలో) ఈ తుపాను తీరం దాటే చాన్స్​ ఉందని ఐఎండీ అంచనా వేసింది. తీరాన్ని తాకే సమయంలో గంటకు 140 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. తుపాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వెల్లడించింది. ఈ నేప‌‌‌‌థ్యంలో  ఏపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. తీరప్రాంత జిల్లాల ప్రజలను హెచ్చరించడంతో పాటు, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది. అత్యవసర సాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించింది.

ఒడిశాలో స్కూళ్లకు సెలవులు& రెడ్ అలర్ట్

తుపాన్​హెచ్చరికల నేపథ్యంలో ఒడిశాలో ఐఎండీ రెడ్​అలర్ట్ జారీచేసింది. తీవ్ర ప్రభావానికి గురయ్యే అవకాశం ఉండటంతో గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్, మల్కన్‌‌‌‌గిరి జిల్లాల్లో అక్టోబర్ 28, 29 తేదీల్లో స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌‌‌‌వాడీ కేంద్రాలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఈ ఐదు జిల్లాల్లో 20 సెం.మీ కంటే ఎక్కువ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం మోహన్ చరణ్ మాఝీ అధికారులను ఆదేశించారు. ముప్పు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు ఓడీఆర్ఏఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సర్వీస్ బృందాలను రంగంలోకి దింపారు. 

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, కడలూర్, నాగపట్నం, తూత్తుకుడి, కరైకల్, పంబన్ వంటి 9 ప్రధాన ఓడరేవుల్లో తుపాను ప్రమాద హెచ్చరికలను  ఎగురవేశారు. పుదుచ్చేరిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ సూచనల మేరకు రైతులు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.