గంగానదిపై ఆకాశమే హద్దుగా ఎయిర్ షో

గంగానదిపై ఆకాశమే హద్దుగా ఎయిర్ షో

 వారణాసి: భారత వైమానిక దళం (ఐఏఎఫ్) 94 ఏండ్లు పూర్తయిన సందర్భంగా వారణాసిలోని నమో ఘాట్‌‌‌‌‌‌‌‌లో ఎయిర్​ షో నిర్వహించారు. మూడురోజులపాటు ‘వింగ్స్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌ గంగా’ పేరిట చేపట్టిన ఈవైమానిక ప్రదర్శన ముగింపు వేడుకలకు.. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు రక్షణ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, యూపీ గవర్నర్‌‌‌‌‌‌‌‌ ఆనందీబెన్‌‌‌‌‌‌‌‌ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్‌‌‌‌‌‌‌‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుఖోయ్‌‌‌‌‌‌‌‌-30, తేజస్‌‌‌‌‌‌‌‌, ఎల్‌‌‌‌‌‌‌‌సీహెచ్‌‌‌‌‌‌‌‌ ప్రచండ్‌‌‌‌‌‌‌‌ యుద్ధవిమానాలు ఆకాశంలో విన్యాసాలతో హోరెత్తించాయి.

సూర్యకిరణ్‌‌‌‌‌‌‌‌  ఆరోబాటిక్‌‌‌‌‌‌‌‌ బృందం మూడు విమానాలతో ‘వి’ ఆకారంలో ఎగురుతూ జాతీయ జెండా రంగులతో కనువిందు చేసింది. ఎంఐ-17 హెలికాప్టర్లు త్రివర్ణపతాన్ని పట్టుకుని 'ఓంకార్' ఫార్మేషన్‌‌‌‌‌‌‌‌లో ప్రదర్శన ఇవ్వడం ఆకట్టుకుంది. ఐఏఎఫ్ ‘సూర్యకిరణ్’ ఏరోబాటిక్ టీమ్, ‘సరంగ్’ హెలికాప్టర్ టీమ్‌‌‌‌‌‌‌‌లు తమ అద్భుతమైన విన్యాసాలు, స్టంట్లతో ప్రజలను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని రావడం స్థానికుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. మోదీకి వెల్​కమ్ చెప్పేందుకు పోలీస్‌‌‌‌‌‌‌‌ లైన్స్‌‌‌‌‌‌‌‌ నుంచి నమో ఘాట్‌‌‌‌‌‌‌‌ వరకు పెద్దసంఖ్యలో ప్రజలు, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. రోడ్డుకు ఇరువైపులా నిల్చొని పూల వర్షం కురిపించారు. దారిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ప్రధాని మోదీ తన వాహనం ఫుట్‌‌‌‌‌‌‌‌బోర్డ్‌‌‌‌‌‌‌‌పై నిలబడి జనానికి అభివాదం చేశారు. ఈ సందర్భంగా ‘హర్ హర్ మహాదేవ్’, ‘జై శ్రీరామ్’ నినాదాలతో పరిసరాలు మారుమోగాయి. అంతకుముందు ఆదివారం ఉదయం వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని, అక్కడి నుంచి హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌లో మిర్జామురాద్ వెళ్లి, ఆ తర్వాత రోడ్డు మార్గంలో నమో ఘాట్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నారు. వారణాసి పర్యటనలో భాగంగా పీఎం మిర్జామురాద్ ప్రాంతంలో ‘అరవింద్ లిమిటెడ్’ కి చెందిన గార్మెంట్​మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌‌‌‌‌‌‌‌ (నూతన దుస్తుల తయారీ)ను ప్రారంభించారు. అలాగే దాదాపు 300 మంది మహిళా కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. వైమానిక ప్రదర్శనకు సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ‘వారణాసి ఎయిర్‌‌‌‌‌‌‌‌ షో.. అద్భుతం’ అంటూ పోస్ట్ చేశారు.