- అదే మామతో పూజ చేయించి దొరికిన అల్లుడు!
- మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఘటన
ముంబై: మామ బంగారం కొట్టేసి మహీంద్రా థార్కొనుగోలు చేసిన ఓ యువకుడు ఆ కారుకు పూజ చేయాల్సిందిగా మామనే పిలిచి అడ్డంగా దొరికిపోయాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్జిల్లాలో జరిగిన ఈ విచిత్ర ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కొల్హాపూర్ జిల్లా పన్హాలా తహసీల్ పరిధిలోని సతావే గ్రామానికి చెందిన సమర్ చవాన్(19) తన మేనమామ ఉమేష్ మారుతి చవాన్ ఇంటి సమీపంలోనే నివసిస్తున్నాడు. నెల రోజుల క్రితం సమర్ తన మామ ఇంట్లోకి చొరబడి దాదాపు 15 తులాల బంగారు ఆభరాణాలను అపహరించాడు. ఆ బంగారాన్ని స్థానిక జ్యువెలర్ సంగ్రామ్ బాబాసో మోరె సాయంతో రూ.10 లక్షలకు విక్రయించాడు.
వచ్చిన డబ్బుతో తన కలల కారైన సరికొత్త మహీంద్రా థార్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. కొత్త కారును ఇంటికి తీసుకువచ్చిన సమర్.. అత్యుత్సాహంతో బంగారం పోగొట్టుకున్న అదే మామను కారుకు పూజ చేయాల్సిందిగా ఆహ్వానించాడు. ఈ శుభకార్యానికి వెళ్లే ముందు ఉమేష్ తన భార్యతో కలిసి వేసుకోవడానికి బీరువాలోని నగలను వెతకగా అవి కనిపించలేదు. అయితే, అదే అల్మారాలో ఉన్న ఉమేష్ బామ్మగారి నగలు అలాగే ఉండటం, కేవలం ఉమేష్, ఆయన భార్యకు చెందిన నగలు మాత్రమే మాయం కావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది.
ఇంట్లోని వారో, అత్యంత సన్నిహితులో ఈ పనికి పాల్పడి ఉంటారని భావించి కోడోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టయింది. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో అతడితో పాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
