కార్పొరేట్ కాలేజీలపై ఇంటర్ బోర్డు కొరడా ..నాలుగు నెలల్లోనే రూ.4 కోట్లక పైగా ఫైన్లు 

కార్పొరేట్ కాలేజీలపై ఇంటర్ బోర్డు కొరడా ..నాలుగు నెలల్లోనే రూ.4 కోట్లక పైగా ఫైన్లు 
  • 90కి పైగా కాలేజీలపై చర్యలు.. 8 కాలేజీల గుర్తింపు రద్దు  

హైదరాబాద్, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీలపై ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటున్నది. జూలై నుంచి అక్టోబర్ మధ్య నాలుగు నెలల్లోనే 90కి పైగా కాలేజీలకు రూ.4 కోట్లకు పైగా జరిమానాలు విధించింది. మరో 8 ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల గుర్తింపును ఈ ఏడాది రద్దు చేసింది. ఇంటర్ బోర్డు నుంచి జూనియర్ కాలేజీలుగా అనుమతులు తీసుకొని, నిబంధనలకు విరుద్ధంగా జేఈఈ, నీట్ కోచింగ్‌‌‌‌లు నిర్వహిస్తున్న సంస్థలపై అధికారులు చర్యలు చేపట్టారు.

కాలేజీల్లో అకాడమీ పేరుతో అనుమతి లేని క్లాసులు నిర్వహిస్తున్నవాటికి లక్షల్లో జరిమానాలు వేశారు. ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌సీ ఆదేశాల నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలు జరిగిన కాలేజీలపైనా కఠినంగా వ్యవహరించారు. ఒక్కో కాలేజీకి రూ.10 లక్షల చొప్పున ఫైన్ విధించారు. గతేడాది కూడా కార్పొరేట్ కాలేజీలకు బోర్డు దాదాపు రూ.5 కోట్ల జరిమానాలు వేసింది. 

ఫేక్ ఎన్‌‌‌‌వోసీలు, ర్యాంకుల ప్రచారంపై వేటు..

ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నకిలీ ఎన్‌‌‌‌వోసీలు సమర్పించిన కాలేజీలపైనా బోర్డు చర్యలు తీసుకుంది. ఒక్కో కాలేజీకి రూ.8 లక్షల చొప్పున జరిమానా విధించింది. బోర్డు అనుమతి లేకుండా కాలేజీలను మార్చడం, ర్యాంకుల పేరుతో పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇవ్వడం, ఇంటర్‌‌‌‌లో ర్యాంకులు వచ్చినట్లు ప్రచారం చేయడంపైనా ఫైన్లు వేసింది.

జరిమానాలు పడిన 90కి పైగా కాలేజీల్లో శ్రీచైతన్య, నారాయణ, రిజోనెన్స్, వశిష్ట వంటి ప్రముఖ విద్యాసంస్థలతో పాటు ఇతర కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన 8 కాలేజీల గుర్తింపును రద్దు చేసింది. నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు కొనసాగుతాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.