బీసీ విద్యార్థులకు  ఫీజు రీయింబర్స్మెంట్ తిప్పలు 

బీసీ విద్యార్థులకు  ఫీజు రీయింబర్స్మెంట్ తిప్పలు 
  • ఆధార్, ఎస్సెస్సీ వివరాల్లో ‘మిస్‌‌‌‌మ్యాచ్’ పేరిట టెక్నికల్ సమస్యలు 
  • అధికారుల దగ్గరకు క్యూ కడుతున్న స్టూడెంట్స్
  • 15 రోజులు ఆగాల్సిందే అంటున్న ఆఫీసర్లు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీ  విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ అప్లికేషన్ ప్రాసెస్ పెద్ద సమస్యగా  మారింది. ఆన్​లైన్​లో అప్లై చేసుకునే క్రమంలో టెక్నికల్ ఎర్రర్ సమస్యతో  సబ్ మిట్ కావడంలేదని విద్యార్థులు వాపోతున్నారు. ఆధార్ కార్డులోని పేరు, పుట్టిన తేదీ, ఇంటిపేరు, పదో తరగతి  మార్కుల మెమోలో ఉన్న వివరాలతో సరిపోలడం లేదని డిస్‌‌‌‌ప్లేపై డిటెయిల్స్ మిస్ మ్యాచ్ మెసేజ్‌‌‌‌లు కనిపిస్తున్నాయి.

అక్షరాల తేడా, స్పేస్‌‌‌‌లు లేకపోవడం లేదా ఇంటిపేరు మొదట ఉండి తర్వాత మారడం లాంటి చిన్న చిన్న కారణాలతో అప్లికేషన్​ ప్రాసెస్​ముందుకు సాగడం లేదు. ఏండ్ల తరబడి ఒకే ఆధార్, ఒకే మార్కుల మెమోతో చదువుకుంటున్నప్పటికీ, ఇప్పుడు కొత్తగా ఈ ‘మిస్‌‌‌‌మ్యాచ్’ ఎర్రర్  చూపించడంపై విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

14  లక్షల మంది స్టూడెంట్స్

రాష్ర్టంలో ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, మెడికల్, నర్సింగ్ ఇలా వివిధ కోర్సుల్లో చదువుతూ ఫీజు రీయింబర్స్ మెంట్ కు అర్హులు ఉన్న స్టూడెంట్స్ మొత్తం 14 లక్షల మంది ఉన్నారు. వీరికి ఏటా రూ. 2250 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇప్పటి వరకు 9 లక్షల మంది అప్లై చేసుకోగా మరో 5 లక్షల మంది అప్లై చేసుకోవాల్సి ఉందని సమాచారం. ఇందులో ప్రెషర్ స్టూడెంట్స్ తో పాటు, రెన్యువల్ స్టూడెంట్స్ ఉన్నారు. రాష్ర్టంలో పలు కోర్సులకు సంబంధించి ఇంకా అడ్మిషన్లు పూర్తి కాకపోవడంతో  రెన్యువల్ స్టూడెంట్స్ ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఎక్కువ సంఖ్యలో అప్లై చేస్తున్నారు.

డీఎస్ఎస్ భవన్ కు స్టూడెంట్స్

టెక్నికల్  సమస్యలతో అప్లికేషన్  సమర్పించలేకపోతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మసాబ్ ట్యాంక్ బీసీ వెల్ఫేర్ హెడ్ ఆఫీస్ కు వస్తున్నారు. అధికారులు మాత్రం  డేటా అప్‌‌‌‌డేట్ కావడానికి కనీసం 15 రోజులు పడుతుంది, అంతవరకు వేచి చూడాల్సిందే అంటూ చెబుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ దరఖాస్తులకు తొలి విడత అప్లికేషన్ కు ఈ నెల 28వ తేదీనే చివరి గడువుగా నిర్ణయించారు.

ఈ లోపు అప్లై చేస్తేనే తొలి విడత ఫీజు రీయింబర్స్ మెంట్ అమౌంట్ వస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. లేదంటే  కాలేజీలు ఫీజులు వసూలు చేస్తాయని అంటున్నారు. ఆధార్‌‌‌‌ను అప్‌‌‌‌డేట్ చేసినా, అది పోర్టల్‌‌‌‌లో రిఫ్లెక్ట్ కావడానికి సమయం పడుతుండడంతో నిర్ణీత గడువులోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుందా లేదా అని గందరగోళం నెలకొంది. అప్లై చేసుకునేందుకు గడువును మరో నెల పాటు పొడిగించాలని కోరుతున్నారు.   

అప్లికేషన్ సబ్మిట్ కావట్లేదు 

ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం అప్లయ్ చేస్తుంటే  ఆధార్, ఎస్సెస్సీ డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అంటూ ఎర్రర్ మెస్సేజ్ వస్తుంది. ఆధార్ లో, ఎస్సెస్సీలో ఒకే విధంగా వివరాలు ఉన్నప్పటికీ మిస్ మ్యాచ్ అంటూ డిస్ ప్లే అవుతుంది.  మొదటి విడత ఫీజు రీయింబర్స్ మెంట్ అప్లయ్ కోసం ఈ నెల 28  చివరి తేదీ. బీసీ సంక్షేమ శాఖ అధికారులను  సంప్రదిస్తే 15 రోజుల పాటు వెయిట్ చేయాలని చెబుతున్నారు. ఈ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. -  బీటెక్  స్టూడెంట్, హైదరాబాద్ 

టెక్నికల్ ఇష్యూస్  పరిష్కరించాలి 

ఫీజు రీయింబర్స్ మెంట్ కు అప్లై చేసుకునే టైమ్ లో టెక్నికల్ సమస్యలు వస్తున్నాయని వివిధ జిల్లాల స్టూడెంట్స్ మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యను పరిష్కరించాలని బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లను కోరాం. సర్వర్ ప్రాబ్లమ్ ఉందని, ఈ సమస్యను  సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్)  పరిష్కరించాలని చెబుతున్నారు. సర్టిఫికెట్లు అప్ లోడ్ కావట్లేదు. ఇన్ కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్ అప్ లోడ్ చేస్తుంటే  ఎర్రర్ వస్తుందని చెబుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. - నాగరాజు, విద్యార్థి నాయకుడు