ఆల్‌టైమ్ హై నుంచి 53% పడిపోయిన వెండి.. ఇప్పుడు కొనడం బెటరా? వేచి చూడటం మంచిదా?

ఆల్‌టైమ్ హై నుంచి 53% పడిపోయిన వెండి.. ఇప్పుడు కొనడం బెటరా? వేచి చూడటం మంచిదా?

ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిల నుంచి వెండి ధరలు ఏకంగా 50 శాతానికి పైగా పడిపోవడం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. ఒకప్పుడు కేజీ రేటు రూ.4 లక్షలు దాటి చుక్కలు చూపించిన వెండి రేట్లు ఇప్పుడు భారీ పతనాన్ని చవిచూడటంతో.. ఈ సమయంలో సిల్వర్‌లో కొత్తగా పెట్టుబడులు పెట్టాలా? లేక ధరలు మరింత తగ్గే వరకు వేచి చూడాలా? అనే సందిగ్ధత అందరిలోనూ ఉంది. ఈ క్రమంలో మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఇన్వెస్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఇప్పుడు పరిశీలిద్దాం..

ఈ ఏడాది ప్రారంభంలో రికార్డులను సృష్టించిన వెండి రేట్లు.. ఆ తర్వాత క్రాష్ అయ్యాయి. జనవరి 28న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌కు ఏకంగా 117 డాలర్ల ఆల్‌టైమ్ హైకి చేరిన వెండి ధర.. అక్టోబర్ 23 నాటికి ఏకంగా 53 శాతం పడిపోయి కేవలం 54 డాలర్లకు పడిపోయింది. అంటే కేజీ రూ.4 లక్షల స్థాయి నుంచి ప్రస్తుతం రూ.లక్షా 90వేలకు చేరుకుంది. MCX వేదికగా జనవరి 29న కిలో వెండి రికార్డు స్థాయిలో రూ. 3లక్షల 79వేల 983కి ఎగబాకగా.. అక్టోబర్ 23 నాటికి ఏకంగా రూ. లక్షా 94వేల 170కి పడిపోయింది. ప్రస్తుతం భవిష్యత్తు కాంట్రాక్టుల నేపథ్యంలో అక్టోబర్ 26 నాటికి కిలో వెండి రూ. లక్షా 95వేల 500 వద్ద ట్రేడవుతోంది.

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం, డాలర్ బలపడటం వంటి పలు అంశాలు వెండి పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే ధరలు సగానికి పైగా తగ్గాయని ఇదే సరైన కొనుగోలు సమయమని భావించి దూకుడుగా వ్యవహరించడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెండి అనేది బంగారం కంటే ఎక్కువ ఓలటాలిటీ కలిగిన లోహం. కాబట్టి ధరలు ఇంకాస్త తగ్గే అవకాశం లేదా మార్కెట్ స్థిరపడే వరకు కొత్త కొనుగోళ్లకు తొందరపడకూడదని బోనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ నిపేంద్ర యాదవ్ సూచిస్తున్నారు.

వెండికి ఉన్న మరో కోణం దీర్ఘకాలిక భవిష్యత్తుకు భరోసానిస్తోంది. బంగారంలా కాకుండా వెండికి పారిశ్రామికంగా విపరీతమైన డిమాండ్ ఉంది. సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిఫికేషన్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వెండి వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే దీర్ఘకాలంలో వెండి మంచి రాబడులను అందించే అవకాశం ఉంది. కాబట్టి ఒకేసారి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా.. ఈ భారీ కరెక్షన్‌ను దృష్టిలో ఉంచుకుని క్రమంగా SIP పద్ధతిలో కొద్దికొద్దిగా కూడబెట్టుకోవడం బెస్ట్ అంటున్నారు నిపుణులు. అక్టోబర్ 27-28 తేదీల్లో జరగనున్న ఫెడ్ సమావేశం, పీసీఈ ద్రవ్యోల్బణ డేటా వంటి అంశాలను గమనిస్తూ అడుగువేయడం ఇన్వెస్టర్లకు మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.