- పథకం అమలుకు ప్రత్యేక కమిటీ వేసిన సింగరేణి యాజమాన్యం
- నెహ్రూ హౌసింగ్ కాలనీల పేరుతో నిర్మాణాలు
- అమలైతే 38 వేల మంది సింగరేణి కార్మికులకు లబ్ధి
కోల్‌బెల్ట్, వెలుగు: భూగర్భ గనుల్లో ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గును వెలికితీస్తూ జాతికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులకు సొంతిల్లు ఇప్పటికీ కలగానే మిగిలింది. సగటున 35 ఏండ్ల పాటు సంస్థలో పనిచేసి రిటైర్ అయ్యే నాటికి కుటుంబ పోషణ, పిల్లల చదువులకే వచ్చిన వేతనం సరిపోతోంది. రిటైర్మెంట్ తర్వాత వచ్చే మొత్తంతో సొంతిల్లు నిర్మించుకోలేక చాలామంది అద్దె ఇండ్లలోనే జీవిస్తున్నారు. 27 ఏండ్ల కింద సింగరేణి యాజమాన్యం సొంతింటి పథకం అమలుకు చర్యలు తీసుకున్నా ఆచరణలో పెట్టలేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలతో సింగరేణి యాజమాన్యం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంతో కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
రెండు దశాబ్ధాల కింద పునాది..
సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేరుస్తామని 1999లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి సీఎం చంద్రబాబునాయుడు గోదావరిఖనిలో సొంతింటి పథకం అమలుకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తర్వాత ఆ స్కీమ్ ఊసేలేదు. ఆ సమయంలో సింగరేణిలో సుమారు 1.16 లక్షల మంది కార్మికులు ఉండగా, క్వార్టర్ల సంఖ్య కేవలం 46 వేలు మాత్రమే ఉన్నాయి. సుమారు 50 ఏండ్ల కింద నిర్మించిన క్వార్టర్లలో చాలా వరకు నివాసయోగ్యంగా లేకుండా పోయాయి. మరోవైపు వందలాది క్వార్టర్లను కార్మికేతరులు ఆక్రమించుకోవడం, ఇతర రంగాల ఉద్యోగులు ఉండటంతో సింగరేణి కార్మికులకు క్వార్టర్లు దక్కని పరిస్థితి ఏర్పడింది. దీంతో సుమారు 70 వేల మంది కార్మికులు అద్దె ఇండ్లలో నివసించాల్సి వస్తోంది.
2004లో మరోసారి సొంతింటి పథకంపై కదలిక వచ్చింది. సింగరేణి ఉద్యోగులతో సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి, సంస్థ విస్తరించిన వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో నామినల్ ధరలకు ఇంటి స్థలాలు ఇప్పించాలని కొందరు ఆఫీసర్లు, ఎంప్లాయిస్ ప్రయత్నించారు. దీంతోసింగరేణి పర్మిషన్తో 2005 ఫిబ్రవరి 14న ‘ది సింగరేణియన్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్’ పేరుతో ఓ సంఘాన్ని రిజిస్టర్ చేశారు. సభ్యత్వం కోసం వేలాది దరఖాస్తులు వచ్చినా, ప్రభుత్వం భూసేకరణకు ముందుకు రాకపోవడంతో పథకం నిలిచిపోయింది. 2008లో అప్పటి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ‘ఓన్ యువర్ హౌస్’ పథకం కోసం సింగరేణితో అగ్రిమెంట్ చేసుకుంది. భూపాలపల్లి ఏరియాలోని మంజూర్‌నగర్, ఖమ్మం జిల్లా సత్తుపల్లి, మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓసీపీ వెనుకవైపు స్థలాల సేకరణకు చేశారు. అయితే ఈ స్కీం కూడా అమలుకు నోచుకోలేదు.
250 గజాల స్థలం.. కేసీఆర్ హామీ ఉత్తదే..
2017లో సింగరేణి ఎలక్షన్ సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్ కార్మికులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, నిర్మాణానికి రూ.10 లక్షల వడ్డీలేని రుణం ఇస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 300 ఎకరాల స్థలం కేటాయింపు విషయాల్లో అప్పగి ప్రభుత్వం, యాజమాన్యం వివక్ష చూపాయి. దీంతో కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఇంటి స్థలాలు కేటాయించలేకపోయినా యాజమాన్యం 2018 ఏప్రిల్ నుంచి ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షల వడ్డీలేని రుణం మంజూరు చేసే పథకాన్ని అమలు చేసింది. అయితే సుమారు 250 మంది ఉద్యోగులకు మాత్రమే నెలనెల వడ్డీని చెల్లిస్తోంది. ఈ పథకం మినహ ఉద్యోగుల ఇంటి నిర్మాణానికి ప్రత్యేక స్కీం ఏదీ లేకుండా పోయింది.
సింగరేణి యాజమాన్యం ప్రత్యేక కమిటీ ఏర్పాటు...
సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చాలని గుర్తింపు, ప్రాతినిధ్య, ఇతర కార్మిక సంఘాలు పలుమార్లు ఆందోళనలు చేపట్టాయి. కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు సైతం సర్కార్‌పై, యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కార్మికుల సొంతింటి కల నిజం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. సింగరేణి మైనింగ్ చేయని భూముల్లో ‘నెహ్రూ హౌసింగ్ కాలనీల’ పేరుతో గృహ నిర్మాణాలు చేపట్టి, ఉద్యోగులు పదవీ విరమణ చేసే సమయానికి పక్కా ఇల్లు అందించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
అలాగే శిథిలావస్థకు చేరిన పాత క్వార్టర్ల స్థానంలో ఆధునిక వసతులతో కొత్త గృహాలు నిర్మించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. సర్కారు ఆదేశాలతో సింగరేణి యాజమాన్యం, గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో ఒప్పందం కుదుర్చుకుని సొంతింటి పథకం అమలుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఎస్టేట్స్, పర్సనల్, ఫైనాన్స్, సివిల్ డిపార్ట్మెంట్ల అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ప్రాథమికంగా పోలీసు శాఖలో ఓన్‌హౌస్ స్కీమ్సమర్ధవంతంగా అమలు చేస్తున్నట్టు గుర్తించిన కమిటీ దానిపై స్టడీకి ప్రియార్టీ ఇస్తున్నట్లు సమాచారం. ఈ పథకం అమలులోకి వస్తే సుమారు 38 వేల మంది సింగరేణి ఉద్యోగులకు
లబ్ధి చేకూరనుంది.
