దేవుడి పూలు.. చెత్త పాలు!..ఆలయాల్లో వ్యర్థాల నిర్వహణ గాలికి 

దేవుడి పూలు.. చెత్త పాలు!..ఆలయాల్లో వ్యర్థాల నిర్వహణ గాలికి 
  • రాష్ట్రంలోని ఆలయాల్లో వ్యర్థాల నిర్వహణ అస్తవ్యస్తం  
  • రోజూ క్వింటాల కొద్దీ పోగవుతున్న వ్యర్థాలు 
  • పట్టించుకోని దేవాదాయశాఖ 
  • చెత్తలోనే మారేడు దళాలు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ కవర్లు 
  • యాదాద్రి పునర్నిర్మాణానికి వందల కోట్లు పెట్టినా ప్రాసెసింగ్ యూనిట్ కరువు

 హైదరాబాద్, వెలుగు: గర్భగుడిలో కొలువైన దైవానికి భక్తులు పూలమాలలు, మారేడు దళాలు, తులసి, బంతి, చామంతి దండలు, కొబ్బరికాయలు సమర్పిస్తారు. అర్చకులు ఆ పవిత్ర ద్రవ్యాలతో వేదమంత్రోచ్ఛారణల మధ్య అభిషేకాలు, అర్చనలు చేస్తారు. పూజ ముగిసిన తర్వాత ఆ పవిత్రమైన నిర్మాల్యం ఏమవుతోందన్న స్పృహ దేవాదాయ ధర్మాదాయశాఖకు లేదు. స్వామివారికి అలంకరించిన పూలదండలు మరుసటి రోజు తెల్లారేసరికి చెత్త ట్రాక్టర్లలోకి చేరుతున్నాయి. 

పట్టణాలు, నగరాల శివారుల్లోని డంపింగ్ యార్డుల్లో ప్లాస్టిక్, మురుగు వ్యర్థాల మధ్య కుళ్లిపోతూ దుర్వాసన వెదజల్లుతున్నాయి. నిత్యం క్వింటాల కొద్దీ పూజా వ్యర్థాలు పోగవుతున్నా.. వాటిని పునర్వినియోగించేందుకు ఎలాంటి శాస్త్రీయ వ్యవస్థ లేకపోవడంతో ఆలయాల పవిత్రత మంటగలిసిపోవడమే కాకుండా పర్యావరణానికీ విఘాతం కలుగుతోందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయశాఖ పరిధిలో 760పైగా ఆలయాలు ఉండగా.. ఆదాయాన్ని బట్టి 6(ఎ), 6(బీ), 6(సీ) కేటగిరీలుగా విభజించారు. ప్రముఖ క్షేత్రాలు నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడుతుంటాయి. ఈ ఆలయాలన్నింటి నుంచి సాధారణ రోజుల్లో రోజుకు సగటున 40 నుంచి 50 క్వింటాలకుపైగా పూజా వ్యర్థాలు వెలువడుతున్నాయి. శ్రావణమాసం, కార్తీకమాసం, దేవీ శరన్నవరాత్రులు, బోనాలు, బ్రహ్మోత్సవాలు, జాతరల సమయంలో ఈ వ్యర్థాల పరిమాణం 100 నుంచి 150 క్వింటాలపైగా చేరుతోంది. ఈ వ్యర్థాలలో కేవలం పువ్వులే కాకుండా భక్తులు తెచ్చే ప్లాస్టిక్ క్యారీబ్యాగులు, నైలాన్ దారాలు, దీపాల నూనె ప్యాకెట్లు, అగ్గిపెట్టెలు, అగరబత్తుల ప్యాకెట్లు, పండ్లు, మిగిలిపోయిన ప్రసాదాలు కలిసిపోతున్నాయి.

ప్రముఖ క్షేత్రాల్లోనూ చెత్త పరేషాన్

తెలంగాణకే తలమానికంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దాదాపు రూ.1,200 కోట్లకుపైగా నిధులతో పునర్నిర్మించారు. కానీ, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను మాత్రం విస్మరించారు. సాధారణ రోజుల్లో 30 నుంచి 50 వేల మంది, వారాంతాల్లో 50 నుంచి లక్షకుపైగా భక్తులు  వస్తుంటారు. నిత్య కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమాలు, ప్రత్యేక పూజలతో రోజుకు సగటున 1,500 నుంచి 2,000 కిలోల పూల వ్యర్థాలు, తులసి మాలలు పోగవుతున్నాయి. కొండపైన ఎక్కడా రీసైక్లింగ్ యూనిట్ లేకపోవడంతో ఆలయ పారిశుధ్య కార్మికులు వీటన్నింటినీ ట్రాక్టర్లలో నింపి చెత్త డంపింగ్ పాయింట్‌‌‌‌కు తరలించి  పారబోస్తున్నారు. 

ఆలయానికి అనుబంధంగా ఉన్న స్థలంలో పెద్ద గోశాల, ఉద్యానవనాలున్నా.. ఆ పూల వ్యర్థాలతో కనీసం వర్మీ కంపోస్ట్ తయారుచేసే యూనిట్‌‌‌‌ కూడా ఏర్పాటు చేయలేకపోయారు. ఇక భద్రాచలం రామయ్య సన్నిధిలో రోజుకు 800 నుంచి 1,200 కిలోల పూలు, తలంబ్రాల వ్యర్థాలు వస్తున్నాయి. వీటిని సిబ్బంది నేరుగా గోదావరి స్నాన ఘట్టాల వద్ద పారబోస్తుండటంతో పవిత్ర నది ప్లాస్టిక్, కుళ్లిన పూలతో కలుషితమవుతోంది. వేములవాడ రాజన్నకు సమర్పించే మారేడు దళాలు, పూలు, ధర్మగుండం నాచుతో కలిపి రోజుకు వెయ్యి నుంచి 1,500 కిలోల వ్యర్థాలు వస్తున్నాయి. వీటిని మున్సిపల్ చెత్త వాహనాలకు అప్పగిస్తుండగా.. వారు సాధారణ చెత్తతో కలిపి డంపింగ్ యార్డుల్లో పారేస్తున్నారు. 

హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ, పెద్దమ్మ గుడి, ఉజ్జయిని మహంకాళితో సహా 50కి పైగా ఆలయాల నుంచి సాధారణ రోజుల్లోనే ఒక్కో గుడి వద్ద 800 నుంచి 2,000 కిలోల వ్యర్థాలు వస్తాయి. బోనాలు, నవరాత్రుల్లో ఇది 10 క్వింటాళ్లు దాటుతోంది. ఇవన్నీ నేరుగా జవహర్‌‌‌‌నగర్ డంపింగ్ యార్డుకు చేరుతున్నాయి. కొండగట్టులో రోజూ వేల సంఖ్యలో పోగయ్యే కొబ్బరి చిప్పలను కారుచౌకగా వేలం వేస్తున్నారు. కొమురవెల్లిలో పట్నాల వ్యర్థాలు కుప్పలుగా మురిగిపోతుండగా, బాసరలో పూలను గోదావరిలోనే పారేస్తున్నారు. 

సెగ్రిగేషన్ లేకపోవడమే శాపం

ఆలయాల వద్ద తడి, పొడి వ్యర్థాల విభజన (సోర్స్ సెగ్రిగేషన్) జరగకపోవడమే అసలు సమస్య. పూలతో పాటు ప్లాస్టిక్ సంచులు, కర్పూరం డబ్బాలు కలవడంతో సేంద్రియ ఎరువుల తయారీకి వీల్లేకుండా పోతోంది. సీఎంసీ, ఎంఎంసీ, జీహెచ్‌‌‌‌ఎంసీ చేపట్టిన ప్రాజెక్ట్ ఉద్వాసన పాత దేవుడి ఫొటోలు, విగ్రహాలకే పరిమితమైంది తప్ప.. పచ్చి పూల వ్యర్థాల రీసైక్లింగ్‌‌‌‌పై ఎలాంటి పాలసీ లేదు. ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి పూల వ్యర్థాలతో ప్రత్యేక ప్లాంట్‌‌‌‌లో రోజుకు లక్షలాది అగరబత్తులు తయారుచేస్తూ ఆదాయం ఆర్జిస్తోంది. మధ్యప్రదేశ్‌‌‌‌లోని ఉజ్జయినిలో వెలువడే పూలు, మారేడు దళాలతో ఆర్గానిక్ ఎరువు తయారు చేస్తున్నారు. 

ఈ ఎరువును రైతులకు అతి తక్కువ ధరకే పంపిణీ చేస్తున్నారు. విజయవాడ కనకదుర్గ గుడిలోని పూల వ్యర్థాలతో సాంబ్రాణి కప్పులు, ధూప్‌‌‌‌స్టిక్స్ తయారుచేస్తూ ఆలయ ప్రాంగణంలోనే విక్రయిస్తున్నారు. ముంబై సిద్ధివినాయక ఆలయంలో పూల వ్యర్థాలతో హోలీ పండుగకు వాడే ఆర్గానిక్ రంగులు, ఫ్లోర్ క్లీనర్లుగా వాడే బయో-ఎంజైమ్స్ తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఆలయ వ్యర్థాల నిర్వహణ బాధ్యతను సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలోని మహిళా సంఘాలకు అప్పగిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని దేవాదాయశాఖ, మున్సిపల్​, పంచాయతీశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ‘జీరో వేస్ట్ డివైన్’ పాలసీని తీసుకురావాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.