ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 సినిమా టికెట్ రేట్ల పెంపు !

ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 సినిమా టికెట్ రేట్ల పెంపు !

టాలీవుడ్లో ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే.. సినిమా టికెట్ల రేట్ల పెంపు ఒక ట్రెండ్ అయిపోయింది. సినిమా బడ్జెట్ భారీగా ఉండటం వల్ల టికెట్ రేట్ల పెంపును కోరుతున్నామని ప్రొడక్షన్ కంపెనీలు చెబుతుండగా, ప్రభుత్వాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాయి. ప్రేక్షకుల పైనే ఈ టికెట్ల పెంపు భారం పడుతుంది. ఇప్పుడు ఈ టికెట్ రేట్ల పెంపు మరో సినిమా వంతు. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం(AK47)’ సినిమా అక్టోబర్ 30న విడుదల అవుతున్న  సంగతి తెలిసిందే.

ఈ సినిమా టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సినిమా విడుదలైన పది రోజుల వరకూ రోజుకు 5 షోలకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేట్లపై 50 రూపాయలు, మల్టీప్లెక్స్ల్లో 75 రూపాయలు అదనంగా పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. 

తెలంగాణలో ఆదర్శ కుటుంబం టికెట్ రేట్ల పెంపుపై ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. రేపోమాపో తెలంగాణలో కూడా టికెట్ రేట్ల పెంపుపై జీవో విడుదల చేస్తారని సినిమా యూనిట్ భావిస్తోంది. ఏపీలో ఆదర్శ కుటుంబం సినిమా టికెట్ రేట్లపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారణాసి లాంటి సినిమాలకు టికెట్ రేట్ల పెంచేసి, ఆదర్శ కుటుంబం లాంటి సినిమాలకు టికెట్ రేట్లను పెంచేసి.. ప్రేక్షకుడికి సినిమా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలనే ఆసక్తిని చంపేస్తున్నారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన  ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ (ఏకే 47). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  ఎస్. రాధాకృష్ణ (చినబాబు)  నిర్మించారు. అక్టోబర్ 30న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. కామెడీ విత్ యాక్షన్‌‌‌‌తో కట్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.