టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంట మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవలే ప్రముఖ టాక్ షో 'కాఫీ విత్ కరణ్ - సీజన్ 9' షోలో ఈ కపుల్స్ సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ షోలో తమ పెళ్లి ముచ్చట్లు, రష్మిక ప్రతిపాదన గురించి పంచుకున్న ఆసక్తికరమైన విశేషాలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా కాకరేపాయి. వీరి వ్యాఖ్యలకు కొందరు సరదాగా స్పందిస్తే.. మరికొందరు మాత్రం విమర్శలు, ట్రోల్స్‌తో రెచ్చిపోయారు.
అయితే ఈ వివాదం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. తమపై జరుగుతున్న ఆన్లైన్ దాడుల విషయంలో విజయ్–రష్మిక టీమ్ నేరుగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తూ వారి మేనేజర్ పి. నిశాంత్ కుమార్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
కల్పిత కథనాలు, మార్ఫింగ్ చేసిన స్క్రీన్షాట్లు, నకిలీ గుర్తింపులతో పోస్టులు చేయడం, వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని వేధించడం వంటి అంశాలను ఫిర్యాదులో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన లింకులు, ఆధారాలను కూడా అధికారులకు సమర్పించినట్లు సమాచారం. అయితే ఈ ఫిర్యాదు వెనుక అసలు ఉద్దేశం ప్రతి విమర్శనూ అడ్డుకోవడం కాదని టీమ్ స్పష్టం చేసింది. అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛను గౌరవిస్తూనే.. తప్పుడు సమాచారాన్ని నిజమని నమ్మించే ప్రయత్నాలు, ఉద్దేశపూర్వక వేధింపులపై చట్టపరమైన చర్యలు కోరుతున్నట్లు వెల్లడించింది.
►ALSO READ | Scene Glimpse Out: డీఎస్పీ ప్రేమ్‌రాజ్‌గా సూర్య.. క్రైమ్, కామెడీతో 'సీన్' గ్లింప్స్ రిలీజ్!
ఈ వివాదానికి కారణం కాఫీ విత్ కరణ్ 9 షోలో పెళ్లి గురించి జరిగిన సంభాషణ. విజయ్ను రష్మిక 100 సార్లు పెళ్లి చేసుకుందామని అడిగారని, ఆయన సరదాగా స్పందించిన మాటలను కొందరు నెటిజన్లు మరోలా అర్థం చేసుకున్నారు. దీంతో విజయ్‌పై 'రెడ్ ఫ్లాగ్' అంటూ విమర్శలు మొదలయ్యాయి. దీనిపై రష్మిక స్పందిస్తూ విజయ్‌నే మళ్లీ మళ్లీ ఎంచుకుంటాననే భావనను వ్యక్తం చేయగా.. విజయ్ సైతం తమ బంధంపై వస్తున్న వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. రష్మికను తన బెస్ట్ ఫ్రెండ్, భార్య, నా ప్రపంచం.. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం" అని పోస్టులు పెడుతూ ఆకతాయిల నోళ్లు మూయించే ప్రయత్నం చేశారు.
లేటెస్ట్ ఫిర్యాదుతో ఈ వ్యవహారం సోషల్ మీడియా చర్చల నుంచి అధికారిక విచారణ దశకు చేరింది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమగ్ర విచారణ వేగవంతం చేశారు. మరి ఈ లీగల్ వార్ విరోష్ జంటను లక్ష్యంగా చేసుకున్న ట్రోలర్లకు ఏ స్థాయిలో చెక్ పెడుతుందో వేచి చూడాలి..
