న్యూజిలాండ్ ఎతో జరుగుతోన్న తొలి అనధికారిక టెస్టులో భారత యంగ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను దురదృష్టం వెంటాడింది. అంపైర్ తప్పుడు నిర్ణయంతో ఒక్క రన్ తేడాతో పడిక్కల్ (199) తృటిలో డబుల్ సెంచరీ మిస్ అయ్యింది. జాక్ గిబ్సన్ బౌలింగ్‌లో డౌన్ ది లైగ్ సైడ్ వేసిన బంతిని పడిక్కల్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతని బ్యాట్‌ను మిస్సై ప్యాడ్లను తాకుతూ వికెట్ కీపర్ చేతిలో పడింది. న్యూజిలాండ్ ఆటగాళ్లు క్యాచ్ బిహైండ్ కోసం అప్పీల్ చేయగా అంపైర్ దానిని ఔట్‌గా ప్రకటించారు.
మొదట అంపైర్ వేలు ఎత్తలేదు.. కానీ కాసేపు ఆలోచించి అవుట్ సిగ్నల్ ఇవ్వడంతో పడిక్కల్ షాక్‌కి గురయ్యాడు. బంతి ప్యాడ్లను తాకిన సౌండ్‌ను బ్యాట్‌గా పొరపడి అంపైర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో పడిక్కల్ అంపైర్ వైపు చూస్తూ బంతికి తన బ్యాట్‌కు మధ్య ఉన్న దూరాన్ని చూపిస్తూ తీవ్ర అసంతృప్తితో మైదానాన్ని వీడాడు. డబుల్ సెంచరీ మిస్ అయినప్పటికీ కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుని తిరిగి పోటీలో నిలబెట్టినందుకు డకౌట్లో భారత ఆటగాళ్లు పడిక్కల్‌ను అభినందించారు.
లింకన్‌లోని బెర్ట్ సట్‌క్లిఫ్ ఓవల్‌లో జరుగుతోన్న ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఏ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది. దేవదత్ పడిక్కల్(32), యశ్ రాథోడ్(44) టాప్ స్కోరర్లు. మిగిలిన బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు.
►ALSO READ | CSK బ్యాటింగ్ కోచ్‌గా ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్.. ఈసారి అస్సామే అంటూ ఫ్యాన్స్ ట్రోలింగ్..!
అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగుల స్కోర్ చేసి 204 రన్స్ భారీ ఆధిక్యాన్ని సాధించింది. దీంతో 204 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. కేవలం 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(5), యశస్వి జైస్వాల్(4) ఘోరంగా విఫలమయ్యారు.
ఈ దశలో పడిక్కల్, సాయి సుదర్శన్ జతకట్టి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. పడిక్కల్,సాయి సుదర్శన్ (91) మూడో వికెట్‌కు 215 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు జోడించాడు. సెంచరీ ముంగిట సాయి సుదర్శన్ ఔటైనా.. కెప్టెన్ ధ్రువ్ జురెల్(2) నిరాశపర్చినా.. యశ్ రాథోడ్‌తో కలిసి పడిక్కల్ ఐదో వికెట్‌కు 142 పరుగులు జోడించాడు. ఈ దశలో అంపైర్ తప్పుడు నిర్ణయంతో డబుల్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో పడిక్కల్ (199) ఔటయ్యాడు.
