ఆన్‌లైన్ షాపింగ్ మోసం: రూ.700 చీర రిటర్న్ చేయబోయి రూ.లక్ష పోగొట్టుకున్న మహిళ!

ఆన్‌లైన్ షాపింగ్ మోసం: రూ.700 చీర రిటర్న్ చేయబోయి రూ.లక్ష పోగొట్టుకున్న మహిళ!

ఆన్‌లైన్‌లో రూ. 674 పెట్టి చీర కొన్న ఓ మహిళకు చివరికి సర్వస్వం కోల్పోయే దుస్థితి వచ్చింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో కొన్న శారీ నచ్చకపోవడంతో దాన్ని రిటర్న్ చేయాలనుకున్న ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాకు చెందిన ఆకాంక్ష అనే మహిళా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంది. రీఫండ్ డబ్బుల కోసం ఆశపడి దాచుకున్న డబ్బు మొత్తాన్ని కోల్పోయింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

ఇటావా జిల్లా బసయియాహర్ గ్రామానికి చెందిన ఆకాంక్ష.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.674 పెట్టి ఒక చీరను కొనుగోలు చేసింది. అయితే ఆ ప్రొడక్ట్ నచ్చకపోవడంతో ఆమె దాన్ని రిటర్న్ చేసి రీఫండ్ కోసం రిక్వెస్ట్ పెట్టింది. 7 రోజులు గడిచినా అకౌంట్లో డబ్బులు జమ కాకపోవడంతో శనివారం రోజు ఆర్డర్‌కు సంబంధించిన నంబర్‌కు ఫోన్ చేసింది. ఆ సమయంలో అవతలి నుంచి మాట్లాడిన సైబర్ కేటుగాడు.. రీఫండ్ ప్రాసెస్ పూర్తి చేస్తామని నమ్మించారు. ఫోన్ స్క్రీన్ షేర్ చేయాలని, ఆ నంబర్‌కు వచ్చిన గిఫ్ట్ కార్డ్‌ను ఓపెన్ చేయాలని వారు సూచించాడు.

వాళ్లు చెప్పిన మాయమాటలు నమ్మిన ఆకాంక్ష తన మొబైల్ స్క్రీన్ షేర్ చేసి గిఫ్ట్ కార్డ్ ఓపెన్ చేసింది. అంతే క్షణాల వ్యవధిలో ఆమె ఫోన్‌ను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్న కేటుగాళ్లు.. ఆమె బ్యాంక్ ఖాతా నుంచి 5 విడతలుగా రూ. 99వేల 518 ఖాళీ చేశారు. తొలుత రూ.10 వేల చొప్పున 2 సార్లు, ఆ తర్వాత రూ. 19వేల 999, ఆపై రూ.55వేలు, చివరగా రూ. 4వేల 495ను ఆమె అకౌంట్ నుంచి తస్కరించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఈ తంతు జరగగా.. సాయంత్రం అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్న ఆకాంక్షకు అందులో ఒక్క రూపాయి కూడా లేకపోవడంతో గుండె ఆగిపోయినంత పనైంది.

ALSO READ : ఉద్యోగం పోయిందనే బాధలో టెక్కీ..

ఆ డబ్బు ఆకాంక్ష పెళ్లి కోసం, ఇంట్లో వాటర్ పంప్ బిగించడం కోసం కుటుంబ సభ్యులు ఎంతో కష్టపడి దాచుకున్న సేవింగ్స్. ఈ మోసంపై ఆమె వెంటనే తన తండ్రికి తెలపగా.. వారు బ్యాంకుకు వెళ్లినప్పటికీ అప్పటికే బ్యాంకు మూసివేయబడి ఉంది. ఈ ఘటనపై లావెడి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ గౌరవ్ కుమార్ మాట్లాడుతూ.. బాధితుల నుంచి ఇంకా అధికారికంగా ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందిన వెంటనే సైబర్ క్రైమ్ రూల్స్ ప్రకారం దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు అపరిచితుల కాల్స్ పట్ల, స్క్రీన్ షేరింగ్ యాప్‌ల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటనే హెచ్చరిస్తోంది. ఇలా చాలా మంది ఈ రోజుల్లో రీఫండ్స్ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో పొరపాట్లు వారి బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేసేస్తున్నాయి.