ఉద్యోగం ఊడిపోయిన బాధతో మానసికంగా కుంగిపోయిన ఒక టెక్కీకి.. తాను పనిచేసిన కార్పొరేట్ కంపెనీ దయలేని రూల్స్ వేదనను మిగిల్చాయి. ఉద్యోగం పోయిన బాధలో ఆఫీస్కు వెళ్లిన అతనికి, కనీసం తన రెండేళ్ల చిన్నారితో లోపలికి వెళ్లేందుకు కూడా అనుమతి నిరాకరించారు. మానవత్వం మరిచి కఠినంగా వ్యవహరించే ఐటీ కంపెనీల తీరుపై రెడ్డెట్ వేదికగా సదరు వ్యక్తి పంచుకున్న అనుభవం తాలూకు ఆవేదన ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది.
రెడిట్ కమ్యూనిటీలో ‘rockpaperblr’ అనే యూజర్ తన ఆవేదనను పంచుకున్నారు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కంపెనీ లాప్టాప్ను తిరిగి ఇచ్చేందుకు అతను తన రెండేళ్ల బాబుతో కలిసి ఆఫీస్కు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో భార్య ఉద్యోగానికి వెళ్లడం, ఇంట్లో అతడిని చూసుకునే వారు ఎవరూ లేకపోవడంతో చిన్నారిని తీసుకెళ్లడం మినహా అతనికి వేరే మార్గం లేకపోయింది. కేవలం 5 నిమిషాల్లో లాప్టాప్ ఇచ్చి వచ్చేయవచ్చని, చివరి రోజే కదా అని అతను ఎంత బతిమలాడినా సెక్యూరిటీ సిబ్బంది అంగీకరించలేదు. చిన్నారిని లోపలికి అనుమతించేందుకు కంపెనీ రూల్స్ ఒప్పుకోవని తేల్చిచెప్పారు.
►ALSO READ | రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలోనూ టిక్కెట్లపై ఇన్సూరెన్స్.. 45 పైసలతో రూ.10 లక్షల కవరేజ్!
దీంతో చేసేది లేక ఆ తండ్రి ఆఫీస్ బయట ఒక సహోద్యోగిని సంప్రదించి, కాసేపు బాబును చూసుకోవాలని కోరాల్సి వచ్చింది. అనుకున్నట్లుగా 5 నిమిషాల్లో అయిపోవాల్సిన పని కాస్తా 15 నిమిషాలు పట్టడంతో.. ఆ చిన్నారి పడిన ఇబ్బంది అంతాఇంతా కాదు. ఉద్యోగం కోల్పోయిన బాధలో ఉన్న తనకు కనీసం ఆఖరి రోజు కూడా కంపెనీ నుంచి ఎలాంటి మానవత్వం కనపడలేదని వాపోయారు. ఉద్యోగులంటే కేవలం ఒక వస్తువులా చూసే కార్పొరేట్ సంస్థలకు వ్యక్తిగత పరిస్థితులతో ఏమాత్రం సంబంధం ఉండదని ఈ సంఘటన తనకు కళ్లకు కట్టినట్లు తెలిపిందని టెక్కీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. "కంపెనీలు ఎప్పుడూ మానవత్వంతో ఆలోచించవు, అదొక వ్యాపారం మాత్రమే అని ఇప్పుడైనా అర్థమైందా?" అంటూ కొందరు కామెంట్ చేయగా.. ఉద్యోగులను యంత్రాల్లా చూసే కార్పొరేట్ సంస్కృతి మారాలని మరికొందరు మండిపడ్డారు. ఏది ఏమైనప్పటికీ.. ఉద్యోగం పోయిన బాధలో ఉన్న వ్యక్తి పట్ల కంపెనీ వ్యవహరించిన తీరు మాత్రం ఐటీ రంగంలో చర్చనీయాంశంగా మారింది.
