రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు ఆన్లైన్లో IRCTC వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వారికి మాత్రమే అందుబాటులో ఉన్న 'ఆప్షనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ స్కీమ్'ను.. ఇకపై ఆఫ్‌లైన్ రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్లు కొనేవారికి కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అక్టోబర్ 27, 2026 నుంచి ఈ నిబంధన దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది.
ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం ద్వారా ప్రయాణికులు కేవలం 45 పైసలు చెల్లించి రూ.10 లక్షల వరకు ట్రావెల్ ఇన్సూరెన్స్ రక్షణ పొందవచ్చు. రైలు ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు దీని ప్రయోజనాలు అందుతాయి. దీనికి సంబంధించి రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి?
* రైలు ప్రమాదాల్లో ప్రయాణికుడు మరణించినా లేదా శాశ్వతంగా పూర్తిగా అంగవైకల్యం పాలైనా రూ.10 లక్షల వరకు పరిహారం అందుతుంది.
* శాశ్వతంగా పాక్షిక అంగవైకల్యం జరిగితే రూ.7 లక్షల 50వేల వరకు పరిహారం ఇస్తారు.
* ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరితే వైద్య ఖర్చుల కోసం రూ.2 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.
* ఒకవేళ మరణిస్తే సదరు ప్రయాణికుడి భౌతిక కాయాన్ని సొంతూరికి తరలించడానికి రూ.10వేలు అందజేస్తారు.
ఈ సదుపాయం ఎలా పొందాలి?
ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడం పూర్తిగా ప్రయాణికుల ఇష్టానికే వదిలేశారు. అంటే ఇది ఆప్షనల్ మాత్రమే. కౌంటర్లలో టికెట్ బుక్ చేసే సిబ్బంది ముందుగా ప్రయాణికులకు ఈ ఇన్సూరెన్స్ గురించి వివరించాలి.
ALSO READ : ఒరిజిల్ బంగారం ధర పడిపోతుందా
ఎవరైనా ఇన్సూరెన్స్ కావాలని కోరుకుంటే.. వారు తప్పనిసరిగా తమ మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రీమియం అమౌంట్‌ను కేవలం డిజిటల్ పద్ధతిలోనే (యూపీఐ, కార్డ్స్ ద్వారా) చెల్లించాలి. టికెట్ ధరతో పాటు ఈ 45 పైసలు కూడా కలిపి తీసుకుంటారు. ఆ తర్వాత పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు ప్రయాణికుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు మెసేజ్ ద్వారా వస్తాయి. ఆన్లైన్ టికెట్లకు వర్తించే అన్ని నిబంధనలే కౌంటర్ టికెట్ల ఇన్సూరెన్స్కూ వర్తిస్తాయని రైల్వే బోర్డు వెల్లడించింది.
