ఒరిజిల్ బంగారం ధర పడిపోతుందా : ల్యాబ్ బంగారం మార్కెట్ లోకి వస్తే పరిస్థితి ఏంటీ..?

ఒరిజిల్ బంగారం ధర పడిపోతుందా : ల్యాబ్ బంగారం మార్కెట్ లోకి వస్తే పరిస్థితి ఏంటీ..?

పాతకాలపు అల్కెమిస్టుల కల నిజమవుతుందా? పాదరసాన్ని బంగారంగా మార్చవచ్చా? శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో అనుకుంటున్న ఈ ప్రశ్నకు 'మారథాన్ ఫ్యూజన్' అనే అమెరికన్ స్టార్టప్ సమాధానం చెప్పింది. ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా వచ్చేన్యూట్రాన్లను ఉపయోగించి పాదరసాన్ని స్థిరమైన బంగారంగా మార్చినట్లు ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేంది ఈ కంపెనీ. గతంలో సార్న్ (CERN) సృష్టించిన రికార్డు కంటే 10 రెట్లు వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేశామని తెలిపింది.

శాస్త్రపరంగా ఇది సాధ్యమే అయినప్పటికీ.. వాణిజ్యపరంగా ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందనే దానిపై స్పష్టత లేదు. సాధారణ కెమికల్ రియాక్షన్స్ మాదిరిగా కాకుండా అణువుల కేంద్రకాలను మార్చడాన్ని 'న్యూక్లియర్ ట్రాన్స్‌మ్యూటేషన్' అంటారు. ఈ పద్ధతిలో పాదరసం-198ని ఫ్యూజన్ న్యూట్రాన్ల ద్వారా పాదరసం-197గా మార్చి.. ఆ తర్వాత అది క్షీణించి స్వచ్ఛమైన బంగారం-197గా మారుతుందని ఈ కంపెనీ చెబుతోంది. అయితే ప్రయోగం విజయవంతమైనప్పటికీ.. అసలు ఎంత బంగారం తయారైంది? దాని తయారీ ఖర్చు ఎంత? అనే వివరాలను మాత్రం కంపెనీ ఇప్పటివరకు బయటపెట్టలేదు.

►ALSO READ | బైక్‌ ముందు సీటు కంటే వెనుక సీటు ఎందుకు ఎత్తుగా ఉంటుందో తెలుసా..? దీని వెనుక ఇంత కథ ఉందా..

గతేడాది సార్న్ ల్యాబ్‌లోనూ ఇలాగే బంగారాన్ని సృష్టించినా.. అవి కేవలం కొన్ని సెకన్లు మాత్రమే నిలిచి కరిగిపోయాయి. కానీ తాము నిజమైన, స్థిరమైన బంగారాన్ని సృష్టించామని మారథాన్ ఫ్యూజన్ చెబుతోంది. కంపెనీ అంచనాల ప్రకారం.. భవిష్యత్తులో గిగావాట్ థర్మల్ పవర్‌కు ఏటా సుమారు 2 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఏటా వేల టన్నుల బంగారం మైనింగ్ జరుగుతుండగా.. ఈ ల్యాబ్ బంగారం దానితో పోటీ పడగలదా అనేది ప్రశ్నార్థకమే. అంతేకాకుండా ఈ ప్రక్రియలో రేడియోధార్మిక వ్యర్థాలు వెలువడటం, వాటిని శుద్ధి చేయడానికి చాలా సంవత్సరాలు పట్టడం వంటి పెద్ద తలనొప్పులే ఉన్నాయి.

బంగారం సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ఈ టెక్నాలజీని క్యాన్సర్ చికిత్సలో వాడే 'మెడికల్ ఐసోటోప్స్' తయారీకి ఉపయోగించడంపై ఆ కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టింది. జింక్‌పై న్యూట్రాన్లను ప్రసరింపజేయడం ద్వారా రాగి ఐసోటోపులను తయారు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. సంప్రదాయ బంగారు గనులకు ప్రత్యామ్నాయంగా ఈ ఆర్టిఫిషియల్ గోల్డ్ మారుతుందా లేదా అనేది భవిష్యత్తులో ఈ టెక్నాలజీ ఎంతవరకు కమర్షియల్ సక్సెస్ సాధిస్తుందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. అంటే ల్యాబ్ గోల్డ్ వల్ల ఇప్పట్లో బంగారం రేట్లు పడిపోయే అవకాశం లేదని తెలుస్తోంది. ఒకవేళ వస్తే వాటికి భవిష్యత్తులో బ్యాంకుల్లో తనఖా పెట్టుకుని రుణాలు ఇస్తారా లేదా అనే అనుమానాలు కూడా కొందరి నుంచి వ్యక్తం అవుతున్నాయి.