ఐదు రూపాయల Lays ప్యాకెట్లో ఇంత మోసమా..? 15 గ్రాముల Lays ప్యాకెట్ 4 గ్రాములే ఉన్నందుకు 10 వేల ఫైన్ !

ఐదు రూపాయల Lays ప్యాకెట్లో ఇంత మోసమా..? 15 గ్రాముల Lays ప్యాకెట్ 4 గ్రాములే ఉన్నందుకు 10 వేల ఫైన్ !

చిప్స్ ప్యాకెట్ ఎప్పుడో ఒకసారి కొనే ఉంటారు. తినే ఉంటారు. ‘లోపల ఏం లేదు.. అంతా డొల్ల’ అనే రీతిలో ప్యాకెట్లో సగానికి పైగా గాలే ఉంటుంది. అయితే.. ప్రతీ ప్యాకెట్ మీద ఎన్ని గ్రాములు అనేది మెన్షన్ చేసినట్లు గానే చిప్స్ ప్యాకెట్ మీద కూడా ఇన్ని గ్రాములు అని మెన్షన్ చేసి ఉంటుంది. కానీ ఎప్పుడైనా బరువు చెక్ చేసి చూశారా..?

ప్యాకెట్ పై మెన్షన్ చేసినంత బరువు ఉందో.. లేదో చూశారా..? అలా బరువు చెక్ చేసిన కస్టమర్ Lays చిప్స్ ప్యాకెట్లో మోసం జరిగిందని గుర్తించాడు. Lays మాతృ సంస్థ పెప్సికో నుంచి నష్టపరిహారం పొందేలా అతనికి అనుకూలంగా వినియోగదారుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడు నవంబర్ 10, 2020న, తన ఇంట్లో అతిథులకు వడ్డించడానికి మెట్రో క్యాష్ & క్యారీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వివిధ ఆహార పదార్థాలను కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన ఫుడ్ ప్రొడక్ట్స్లో పెప్సికో ఇండియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన లేస్ బంగాళాదుంప చిప్స్ ప్యాకెట్ కూడా ఉంది. ఇన్వాయిస్ కూడా ఉంది. 

ఈ లేస్ ప్యాకెట్ చించి.. తన అతిథులకు చిప్స్ వడ్డిస్తున్నప్పుడు, ఆ ప్యాకెట్ చాలా తేలికగా ఉన్నట్లు గమనించాడు. దానిలోని చిప్స్‌ను తూకం వేయగా, ప్యాకెట్పై మెన్షన్ చేసిన 15 గ్రాముల నికర బరువుకు బదులుగా ఆ ప్యాకెట్‌లో కేవలం 4 గ్రాముల చిప్స్ మాత్రమే ఉన్నట్లు బాధితుడు గుర్తించాడు. ఫిర్యాదుదారుడు మెట్రో క్యాష్ & క్యారీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఈ విషయాన్ని ప్రస్తావించారు. కానీ ఆ సంస్థ తన ఫిర్యాదుకు సరైన స్పందన ఇవ్వకపోవడంతో ఏప్రిల్ 6, 2022న వినియోగదారుల కమిషన్లో బాధితుడు ఫిర్యాదును దాఖలు చేశాడు. 

►ALSO READ | మద్యం ప్రియులకు షాక్: వైన్ షాపులో బిల్లు వెయ్యి దాటితే... క్యాష్ తీసుకోరంట..! ఆన్ లైన్ పేమెంట్ చేయాల్సిందే..!

తయారీ ప్రక్రియలో చిప్స్ పరిమాణంలో ఏదైనా కొరత ఏర్పడి ఉండవచ్చని.. అటువంటి లోపానికి తయారీదారుడే బాధ్యత వహించాలని వాదిస్తూ, మెట్రో క్యాష్ & క్యారీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆ ఫిర్యాదుపై స్పందించింది. నోటీసు జారీ చేసినప్పటికీ పెప్సికో ఇండియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హాజరు కాకపోవడంతో, ఈ పిటిషన్పై విచారణ ఏకపక్షంగా కొనసాగింది.

చిప్స్ ప్యాకెట్ కొనుగోలు ధర అయిన ₹5ను, ఫిర్యాదు దాఖలు చేసిన తేదీ అయిన ఏప్రిల్ 6, 2022 నుంచి చెల్లింపు జరిగే వరకు సంవత్సరానికి 6% వడ్డీతో సహా వాపసు ఇవ్వాలని కమిషన్ పెప్సికోను ఆదేశించింది. అంతేకాకుండా అతనికి ఈ ఘటన వల్ల జరిగిన మానసిక వేధింపులకు పరిహారంగా ₹5,000, వ్యాజ్య ఖర్చుల నిమిత్తం ₹3,000ను ఉత్తర్వు తేదీ నుంచి ఒక నెలలోపు చెల్లించాలని కూడా పెప్సికోను వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.

నిర్దేశించిన గడువులోగా చెల్లింపు చేయని పక్షంలో, పరిహారం, వ్యాజ్య ఖర్చుల నిమిత్తం చెల్లించాల్సిన ₹8,000 మొత్తంపై, ఉత్తర్వు తేదీ నుంచి చెల్లింపు జరిగే వరకు సంవత్సరానికి 6% వడ్డీ వర్తిస్తుందని వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది.