ఆన్ లైన్ పేమెంట్... నోట్ల రద్దు తర్వాత జనాలకు త్వరగా అలవాటైన ప్రక్రియ. ఎంతలా అంటే..క్యాష్ మెయింటైన్ చేయడం కూడా మరిచిపోయారు చాలామంది. అయితే.. ఇప్పుడు ఈ ఆన్ లైన్, యూపీఐ పేమెంట్స్ తోనే ఇప్పుడు జనాలకు పెద్ద తలనొప్పి వచ్చి పడింది. యూపీఐ పేమెంట్స్ కి చార్జీలు వసూలు చేస్తామంటూ కేంద్రం ప్రకటించడమే ఇందుకు కారణం. ఇప్పుడు మద్యం ప్రియులకు కూడా ఈ ఆన్ లైన్ పేమెంట్స్ తలనొప్పిగా మారనున్నాయి. తమిళనాడులో వైన్ షాపుల్లో బిల్లు వెయ్యి దాటితే క్యాష్ తీసుకోకుండా.. ఆన్ లైన్ పేమెంట్స్ రూపంలోనే తీసుకోవాలని నిర్ణయించింది ప్రభుత్వం. నవంబర్ 1 నుంచి ఈ రూల్ అమల్లోకి రానుంది.
నవంబర్ 1 నుంచి రూ. వెయ్యి దాటిన రిటైల్ మద్యం కొనుగోళ్లకు డిజిటల్ పేమెంట్స్ ను తప్పనిసరి చేసింది తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్. పారదర్శకతను మెరుగుపరచడం, పెద్ద మొత్తంలో నగదు నిర్వహణకు సంబంధించిన ఇబ్బందులను తగ్గించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రూ. వెయ్యి వరకు విలువైన మద్యం కొనుగోలు చేసే వినియోగదారులు నగదు రూపంలో గానీ డిజిటల్ పేమెంట్స్ ద్వారా గానీ చెల్లింపులు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
తమిళనాడు వ్యాప్తంగా ఉన్న 4వేల 48 వైన్ షాపులకు ఈ రూల్ వర్తిస్తుందని తెలిపారు అధికారులు. UPI, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులను ఇప్పటికే అంగీకరిస్తున్నప్పటికీ, చాలా లావాదేవీలు ఇప్పటికీ నగదు రూపంలోనే జరుగుతున్నాయని అన్నారు. ప్రతిరోజూ పెద్దమొత్తంలో క్యాష్ ట్రాంజాక్షన్స్ ఉండటం వల్ల వైన్ షాపు సిబ్బందికి ఇబ్బందిగా మారుతుందని.. క్యాష్ ట్రాన్స్ఫర్ సమయంలో భద్రతాపరమైన ప్రమాదాలు, అకౌంట్స్ లో తేడాలు, నకిలీ నోట్ల ప్రమాదం వంటివి దృష్టిలో పెట్టుకొని డిజిటల్ పేమెంట్స్ తప్పనిసరి చేయాల్సి వచ్చిందని అంటున్నారు అధికారులు.
►ALSO READ | 20 లక్షల ఫాలోవర్లు ఉన్నా.. ఎన్నికల్లో వచ్చింది 33 ఓట్లే.. రాజకీయం అంటే అట్లుంటది మరి!
అంతే కాకుండా, కొన్ని చోట్ల MRP కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని..డిజిటల్ పేమెంట్స్ తప్పనిసరి చేయడం ద్వారా ఈ దోపిడీని అడ్డుకోవచ్చని తెలిపారు అధికారులు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. ప్రతి కొనుగోలుకు బిల్లు ఇవ్వాలని.. POS మెషిన్ ద్వారా ట్రాంజాక్షన్ పూర్తయ్యాకనే మద్యం ఇవ్వాలని వైన్ షాప్ నిర్వాహకులు, సిబ్బందికి సూచించారు అధికారులు.
ఈ మేరకు అన్ని వైన్ షాపుల్లో కొత్త నిబంధన గురించి తెలిసేలా రెండు అడుగుల వెడల్పు, మూడు అడుగుల పొడవున్న పెద్ద నోటీసు బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించింది ప్రభుత్వం.
