దుబాయ్ అంటేనే బంగారానికి పెట్టింది పేరు. కానీ ఇప్పుడు అక్కడ తయారైన ఒక అద్భుతమైన జత జుంకాలు (చెవిపోగులు) ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భారతీయ సాంప్రదాయ డిజైన్‌తో రూపొందిన ఈ భారీ జుమ్కాల ప్రత్యేకత ఏంటంటే.. ఇవి రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సైతం సొంతం చేసుకున్నాయి.
ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ 'జాయ్‌అలుక్కాస్' దీనిని తయారు చేసింది. 22 క్యారెట్ల బంగారంతో రూపొందించిన ఈ భారీ జుమ్కాల జతకు 'మయూర్ సహస్ర' (అంటే వెయ్యి నెమళ్లు అని అర్థం) అని పేరు పెట్టారు. భారతీయ సంస్కృతిలో అందానికి ప్రతీకగా నిలిచే నెమలి డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది వీటిని తీర్చిదిద్దింది కంపెనీ.
ఈ మహా అద్భుతాన్ని తయారు చేయడానికి ఏకంగా 55 మంది నిపుణులైన జ్యువెలరీ వర్కర్స్ కొన్ని నెలల పాటు శ్రమించారు. మొత్తం 5వేల 840 గంటల పాటు కష్టపడి దీనిని పూర్తి చేశారు. వీటి కొలతలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఒక్కో జుంకీ పొడవు 1.215 మీటర్లు కాగా.. వ్యాసం 0.682 మీటర్లు ఉంది. ఇక బరువు విషయానికి వస్తే రెండు జుమ్కాల్లో కలిపి మొత్తం 16కిలోల 514గ్రాముల బంగారం ఉపయోగించారు.
►ALSO READ | ల్యాప్‌టాప్‌లు లాక్.. ఐడీలు బ్లాక్: లంచ్ బ్రేక్‌లో 500 మంది భారత ఉద్యోగులను పీకేసిన ఇన్నోడేటా
ప్రపంచంలోనే అత్యంత భారీ, అతిపెద్ద బంగారు చెవిపోగుల జతగా ఇది గిన్నిస్ రికార్డులకెక్కింది. కేవలం బంగారాన్ని వాడటమే కాకుండా.. వాటిపై చెక్కిన అత్యద్భుతమైన కళాఖండం అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నాయి. భారతీయ సాంప్రదాయ ఆభరణాల కళను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు కంపెనీ సీఈఓ జాన్ పాల్ అలుక్కాస్ తెలిపారు.
గత అక్టోబర్ 24న దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లోని 'జ్యువెల్ ఆఫ్ జాయ్' షోరూమ్‌లో ఈ భారీ జుమ్కాలను అధికారికంగా ఆవిష్కరించారు. దుబాయ్ వచ్చే పర్యాటకులు, స్థానిక ప్రజలు ఈ అద్భుతమైన కళాఖండాన్ని చూసేందుకు వీలుగా షోరూమ్‌లో ప్రదర్శనకు ఉంచారు. బంగారం తయారీ రంగంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
