ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ 28 ఏళ్ల ఇంజినీర్‌కు అక్టోబర్ 26న సోమవారం ఎప్పట్లాగే సాధారణ రోజులాగే స్టార్ట్ అయ్యింది. ఉద్యోగులంతా లాగిన్ అయి, అటెండెన్స్ నమోదు చేసుకుని తమ పనుల్లో బిజీ అయ్యారు. అయితే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయానికి ఫిలిప్పీన్స్‌లోని తమ కంపెనీ టీమ్ సభ్యులు జూమ్ కాల్‌లో తొలగించబడ్డారనే వార్త అతనికి షాక్ ఇచ్చింది.
అది నమ్మశక్యం కాకపోయినా, కొంతమంది భారత్ ఉద్యోగులు హెచ్‌ఆర్ పోర్టల్‌ని చెక్ చేయగా అక్టోబర్ 26నే వారి రాజీనామా, చివరి రోజుగా అందులో చూపించడం గమనించి కంగుతిన్నారు. వెంటనే మేనేజర్లను సంప్రదించేలోపే ఒక్కొక్కరిగా అధికారిక ల్యాప్‌టాప్‌లు లాగౌట్ అయిపోయాయి. కంపెనీ ఇచ్చిన ఐడీలు డీయాక్టివేట్ అయ్యాయి. కొద్దిసేపటికే పర్సనల్ ఈమెయిళ్లకు టెర్మినేషన్ మెయిల్స్ కూడా వచ్చి పడ్డాయి. ఇదంతా ఓ కలలా వారికి వరుస షాకులు ఇచ్చిందంట ఇన్నోడేటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులకు.
ALSO READ : విస్కీ తాగే వాళ్లల్లో మనమే నెంబర్ 1
దీంతో ఒక్క భారత్‌లోనే సుమారు 550 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయినట్లు సమాచారం. కేవలం భారత్ మాత్రమే కాకుండా ఫిలిప్పీన్స్, అమెరికా దేశాల్లోనూ ఈ తొలగింపులు జరిగాయి. ప్రధాన క్లయింట్ నుంచి సేవలు తగ్గిపోవడం, బిజినెస్ అసైన్‌మెంట్స్ రేంప్-డౌన్ కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తన మెయిల్‌లో పేర్కొంది. అయితే ఉద్యోగుల వ్యక్తిగత ప్రతిభకు దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. హెచ్‌ఆర్ పోర్టల్ యాక్సెస్ కూడా ముందే తొలగించడంతో.. కనీసం పేస్లిప్స్, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉద్యోగులకు దక్కలేదు.
భయాందోళనలో టెక్ ఉద్యోగులు..
కంపెనీ చేసిన పనితో బాధిత ఉద్యోగులందరూ వెంటనే ఒక వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని గంటల్లోనే దాదాపు 500 మందికి పైగా ఉద్యోగులు ఆ గ్రూప్‌లో చేరడంతో అసలు ఏం జరుగుతుందో అర్థంకాక వారంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఫైనల్ సెటిల్‌మెంట్ కింద డిమాండ్ డ్రాఫ్ట్ సిద్ధం చేశామని, ఉద్యోగులందరూ కంపెనీ అసెట్స్ అప్పగించిన తర్వాతే పేమెంట్ చేస్తామని ఫిలిప్పీన్స్ సంస్థ తెలిపింది.
ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ ఘటన అద్దం పడుతోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు కూడా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాలు, లేఆఫ్‌లతో తమ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకుంటున్నాయి. AI టెక్నాలజీ వైపు కంపెనీలు మళ్లుతుండటంతో పాటు ప్రాజెక్టులు తగ్గిపోవడం, వ్యాపార ప్రాధాన్యతలు మారుతుండటం ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇలా అకస్మాత్తుగా ఉద్యోగాలు కోల్పోతుండటంతో టెక్ నిపుణుల్లో భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. ఎంత టాలెంట్ ఉన్నా మార్కెట్లో జాబ్ దొరికే పరిస్థితి లేదని వాపోతున్నారు.
