ప్రపంచవ్యాప్తంగా విస్కీ ప్రియులకు కొదవలేదు. అయితే అత్యధికంగా అమ్ముడవుతున్న బెస్ట్ సెల్లింగ్ విస్కీ బ్రాండ్ల జాబితాను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తాయి. వార్షికంగా అమ్ముడయ్యే 9- లీటర్ల కేసుల వాల్యూమ్ ఆధారంగా రూపొందించిన ఈ టాప్-20 సెల్లింగ్ విస్కీ బ్లాండ్ల లిస్టులో ప్రపంచ వ్యాప్తంగా మనవే ఎక్కువ. ప్రపంచ స్థాయి దిగ్గజ బ్రాండ్లను వెనక్కి నెట్టి ఇండియన్ విస్కీలు టాప్ టెన్‌లో సగానికి పైగా నిలిచాయి.
అగ్రస్థానంలో భారతీయ బ్రాండ్లు:
టాప్ విస్కీల జాబితాలో యునైటెడ్ స్పిరిట్స్ మెక్‌డొవెల్స్ నెం.1.. 3కోట్ల 14లక్షల కేసుల అమ్మకాలతో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో రాయల్ స్టాగ్ 2కోట్ల 79లక్షల కేసులతో రెండో స్థానంలో, అల్లైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్ వారి ఆఫీసర్స్ ఛాయిస్ 2కోట్ల 34లక్షల కేసులతో 3వ స్థానంలో, ఇంపీరియల్ బ్లూ 2కోట్ల 28లక్షల కేసులతో 4వ స్థానంలో కొనసాగుతున్నాయి. భారత్‌లో విస్కీకి ఉన్న గిరాకికి ఈ లెక్కలే నిదర్శనం.
అంతర్జాతీయ దిగ్గజాల హవా:
5వ స్థానంలో స్కాట్లాండ్కు చెందిన ప్రపంచ ప్రసిద్ధ జానీ వాకర్ 2కోట్ల 21లక్షల కేసులతో నిలిచింది. అమెరికా నుంచి ప్రసిద్ధ బోర్బన్ విస్కీ జిమ్ బీమ్ కోటి 70లక్షల కేసులతో 6వ స్థానంలో, జపాన్‌కు చెందిన సంటోరి కకుబిన్ కోటి 58లక్షల కేసులతో 7వ స్థానంలో, అమెరికన్ జాకీ ఐకాన్ జాక్ డేనియల్స్ కోటి 43లక్షల కేసులతో 8వ స్థానంలో ఉన్నాయి.
తరువాతి స్థానాల్లో భారతదేశానికి చెందిన 8PM.. కోటి 22లక్షల కేసులతో 9వ స్థానంలో నిలవగా, ఐర్లాండ్ నుంచి జేమ్సన్ కోటి 2లక్షల కేసుల అమ్మకంతో 10వ స్థానాన్ని దక్కించుకున్నాయి. అలాగే భారతీయ బ్రాండ్లయిన బ్లెండర్స్ ప్రైడ్ 96లక్షలు , రాయల్ ఛాలెంజ్ 86లక్షల , స్టెర్లింగ్ రిజర్వ్ 51లక్షల కేసులతో అమ్మకాలతో ఈ టాప్-20 జాబితాలో సత్తా చాటాయి.
ఇవి కాకుండా స్కాట్లాండ్ నుంచి బల్లాంటైన్స్, చివాస్ రిగాల్, గ్రాంట్స్, కెనడా నుంచి క్రౌన్ రాయల్, కెనడియన్ క్లబ్ వంటి బ్రాండ్లు కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది మద్యం ప్రియుల మదిని దోచుకుంటూ ఈ జాబితాలో తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నాయి. మొత్తానికి ప్రపంచ విస్కీ మార్కెట్లో భారతీయ బ్రాండ్ల ఆధిపత్యం అంతర్జాతీయ స్థాయిలో ఏ స్థాయిలో ఉందో ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
