పెట్రోల్ ఖర్చులకు చెక్ పెట్టేలా, దేశీయ ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు క్రూడ్ దిగుమతులను భారీగా తగ్గించాలనే లక్ష్యంతో హై-ఇథనాల్ బ్లెండ్డ్ పెట్రోల్, ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలపై కీలకమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. తాజా గెజిట్ నోటిఫికేషన్‌తో దేశంలో రవాణా రంగంలో భారీ మార్పులు రాబోతున్నాయి.
కేంద్ర మంత్రిత్వ శాఖ గత ఏప్రిల్ 27నే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ రూల్స్‌ను విడుదల చేసింది. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సలహాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అక్టోబర్ 23న అధికారిక నోటిఫికేషన్ జారీ చేసి, అక్టోబర్ 26న గెజిట్‌లో ప్రచురించింది. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. దీని ద్వారా దేశంలో ఫెక్స్ ఫ్యూయెల్ వాహనాల తయారీకి ఆటోమొబైల్ కంపెనీలకు మార్గం సుగమమైంది.
ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు అంటే ఏమిటి?
ఈ వాహనాలు కేవలం పెట్రోల్‌పైనే కాకుండా.. ఇథనాల్, పెట్రోల్ మిశ్రమంతో నడిచేలా తయారవుతాయి. సాధారణ పెట్రోల్ నుంచి 100 శాతం స్వచ్ఛమైన ఇథనాల్ (E100) వరకు దేనితోనైనా ఇవి ప్రయాణించగలవు. ఈ కార్లలో ఉండే ఆన్‌బోర్డ్ సెన్సార్లు ఇంధన మిశ్రమాన్ని గుర్తించి.. అందుకు తగినట్లుగా ఇంజిన్ పనితీరును సర్దుబాటు చేస్తాయి. బ్రెజిల్ దేశంలో సక్సెస్ అయిన ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్‌ను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బ్రెజిల్లో చెరకు నుంచి తీసిన ఇథనాల్‌తో వాహనాలు నడుస్తున్నాయి.
సాధారణ కార్లకు, దీనికి తేడా ఏమిటి?
ప్రస్తుతం మన దేశంలో E20 పెట్రోల్ అమ్మబడుతోంది. అయితే కొత్త నోటిఫికేషన్ ప్రకారం E85, E100 పెట్రోల్ వాడాలంటే అందుకు అనుగుణమైన వాహనాలు ప్రత్యేకంగా డిజైన్ చేయబడి, సర్టిఫై అయి ఉండాలి. సాధారణ పెట్రోల్ కార్లు ఈ హై-బ్లెండ్ ఇథనాల్‌తో నడవలేవు. ఇథనాల్‌కు ఉండే తుప్పుపట్టే స్వభావం కారణంగా ఇంజిన్ భాగాలను మార్చాల్సి ఉంటుంది. ఫ్యూయల్ లైన్లు, సీల్స్, ఇంజెక్టర్లను మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలి. అంతేకాకుండా ఇథనాల్ ద్వారా లభించే ఎనర్జీ పెట్రోల్ కంటే మూడో వంతు తక్కువగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ ఇథనాల్ అవసరం కాబట్టి, ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యాన్ని పెంచడం, తరచూ ఇథనాల్ కొట్టించుకోవడం వంటి మార్పులు అవసరమవుతాయి.
మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దేశీయ కార్ల తయారీ సంస్థలు త్వరలోనే భారత్ మార్కెట్లోకి E100 అనుకూల ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ సరికొత్త హరిత ఇంధన విధానం భారత రవాణా రంగానికి ఎలాంటి మార్పులను తెస్తుందో వేచి చూడాలి.
