హైదరాబాద్: అభివృద్ధి పనుల కోసం చెట్లను నరికివేయకుండా, వాటిని మరోచోటికి తరలించి సంరక్షించే వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు వట ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉదయ్ కృష్ణ పెద్ది రెడ్డి. 2015లో ప్రారంభమైన ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు ఏడు రాష్ట్రాల్లో 7,500కు పైగా చెట్ల తరలింపునకు సహకరించినట్లు ఆ సంస్థ తెలిపింది.. తరలించిన చెట్లలో కనీసం 80 శాతం మనుగడ సాగిస్తున్నాయని ఉదయ్ కృష్ణ అంచనా వేస్తున్నారు.
2010లో మొదలైన ప్రయాణం
2010లో కూకట్పల్లిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం తొలగించాల్సి వచ్చిన 16 చెట్లను మరోచోటికి తరలించాలని ఆయన నిర్ణయించుకున్నారు. వాటిలో 13 చెట్లు బతకడంతో పెద్ద వృక్షాలను కూడా కాపాడవచ్చనే నమ్మకం కలిగింది. అనంతరం చెట్లను దత్తత తీసుకోవాలనుకునేవారిని, వాటిని నాటేందుకు స్థలం ఉన్నవారిని సోషల్ మీడియా ద్వారా అనుసంధానం చేయడం ప్రారంభించారు.తన తల్లి నివాసం సమీపంలోని ఓ రావిచెట్టును కాపాడేందుకు చేసిన పోస్టుకు 500 నుంచి 600 మంది స్పందించడం ప్రజల్లో చెట్లను రక్షించాలనే ఆసక్తి ఉందని నిరూపించింది.
హైవేపై చెట్ల సంరక్షణకు ప్రయత్నం
మోయినాబాద్–అజీజ్నగర్ మధ్య జాతీయ రహదారి 163పై చెట్ల నరికివేతను గమనించిన ఆయన, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఎన్హెచ్ఏఐ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. సుమారు 240 చెట్లను ఉచితంగా తరలించేందుకు అనుమతి కోరారు. అయితే, ఆ తర్వాత ఈ పనిని ఎన్హెచ్ఏఐ స్వయంగా చేపట్టాలని నిర్ణయించింది.చెట్లను దత్తత తీసుకునేవారిని త్వరగా గుర్తించేందుకు ప్రత్యేక యాప్ను రూపొందిస్తున్నారు. చెట్టు ఉన్న ప్రదేశానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఆసక్తి ఉన్నవారికి సమాచారం అందించేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు.
45 భారీ మర్రి చెట్లను కాపాడే లక్ష్యం
2017లో కూకట్పల్లి ఫోరం మాల్ ఫ్లైఓవర్ సమీపంలో 90కి పైగా చెట్లను తరలించినట్లు ఉదయ్ కృష్ణ తెలిపారు. ఒక్కో చెట్టుకు సగటున రూ.3,500 ఖర్చయిందన్నారు.తదుపరి కల్యాణ్–నాసిక్ హైవేపై ఉన్న 45 భారీ మర్రి చెట్లను కొమ్మలు కత్తిరించకుండా తరలించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇందుకు అవసరమైన యంత్రాల సహాయం అందించాలని కేంద్ర మంత్రిని కోరారు.చెట్లను తరలించడం మాత్రమే కాకుండా, వాటికి నీరు పోయడం, నిరంతరం సంరక్షించడం కూడా ముఖ్యమని ఆయన చెబుతున్నారు. అభివృద్ధి పనులు కొనసాగుతూనే చెట్లను కాపాడవచ్చని నిరూపించడమే తన లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు.
