పెద్దపల్లి జిల్లాలో చేపల లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం

పెద్దపల్లి జిల్లాలో చేపల లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద రాజీవ్ రహదారిపై చేపల లోడుతో వెళ్తున్న లారీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టైర్లు వేడెక్కి మంటలు చెలరేగడంతో లారీకి మంటలు అంటుకున్నాయి. ఏపీ నుంచి చేపల లోడుతో ఢిల్లీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

లారీ ముందు టైర్లు వేడెక్కి మంటలు చెలరేగడంతో అవి క్రమంగా లారీ మొత్తానికి వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్ వెంటనే లారీ నుంచి కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ఇద్దరూ సురక్షితంగా బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది.

ALSO READ : హైదరాబాద్లో నాలుగు చోట్ల పేలుడు శబ్దాలు.. పరుగులు తీసిన స్థానికులు

ఈ ఘటనను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లారీకి మంటలు అంటుకోవడంతో రాజీవ్ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్ అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.