- అరెస్ట్ చేసిన పోలీసులు
గండిపేట,వెలుగు: తమిళనాడులోని డీఎంకే లీడర్లపై కోసంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 2024, 2026లో 45 సార్లు నకిలీ బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ పంపిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
చెన్నై ప్రాంతానికి చెందిన శరత్ సుబ్రహ్మణ్యం అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ప్రత్యేక బృందం చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. డీఎంకేకు చెందిన నాయకులపై ఉన్న కోపంతోనే విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపినట్లు నిందితుడు తెలిపినట్టు సమాచారం. 2025, 2026 సంవత్సరాల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సుమారు 45 వరకు నకిలీ బాంబు బెదిరింపు మెయిల్స్ పంపినట్లు పోలీసులు గుర్తించారు.
దేశంలోని వివిధ విమానాశ్రయాలకు కలిపి మొత్తం 800 వరకు నకిలీ బాంబు బెదిరింపు మెయిల్స్ పంపినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని తెలిపారు. వరుసగా బెదిరింపు మెయిల్స్ పంపుతూ తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని గుర్తించేందుకు ఎయిర్‌పోర్ట్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాల సహాయంతో అతని ఆచూకీ గుర్తించి చెన్నైలో అరెస్ట్ చేసినట్లు సమాచారం.
