ఉత్తరాంధ్రలో తుఫాను ప్రభావం షురూ.. శ్రీకాకుళంలో ఈదురుగాలులు.. కోస్తా జిల్లాలకు రెయిన్ అలర్ట్!

ఉత్తరాంధ్రలో తుఫాను ప్రభావం షురూ.. శ్రీకాకుళంలో ఈదురుగాలులు.. కోస్తా జిల్లాలకు రెయిన్ అలర్ట్!

 ఏపీలో అర్నబ్ తుఫాను ప్రభావం మొదలైంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇప్పటికే ఈదరులు గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్నబ్ తుపాను రేపు తీరం దాటడానికి ముందే తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో అర్థరాత్రినుంచే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,అధికారులు జారీ చేసే సూచనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాను వేగంగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. అక్టోబర్ 28 (బుధవారం) ఉదయం బాపట్ల, విశాఖపట్నం మధ్య (యానాం-కాకినాడ సమీపంలో) ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర సహా కోస్తా జిల్లాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో అర్ధరాత్రి నుంచే ఈదురుగాలులు మొదలయ్యాయి. తీర ప్రాంతాల్లో గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి.

 ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యంతో పాటు కోస్తా జిల్లాలకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్,ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రానున్న రోజుల్లో తుఫాను ముప్పు పొంచి ఉండటంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాగల 5 రోజుల పాటు మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.