- ఏపీ వైపు గంటకు 15 కి.మీ వేగంతో కదలిక
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు ‘అర్నాబ్’ తుఫాను దూసుకొస్తోంది. విశాఖపట్నానికి 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ సైక్లోన్.. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతున్నది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో హై అలర్ట్ ప్రకటించారు. వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. అర్నాబ్ తుఫాను పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా సుమారు 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతోంది. సోమవారం అర్ధరాత్రికి తీవ్ర తుఫానుగా బలపడి, మంగళవారం నాటికి అత్యంత తీవ్రమైన తుఫానుగా మారుతుందని అధికారులు అంచనా వేశారు.
ఇది బాపట్ల, విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు. ఆ సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. బెంగాల్ తీరం నుంచి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. అలాగే, తుఫాను ప్రభావంతో డార్జిలింగ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో బెంగాల్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
తీర ప్రాంత రాష్ట్రాల్లో ముందస్తు చర్యలు
అర్నాబ్ తుఫాను దూసుకొస్తుండటంతో తీర ప్రాంత రాష్ట్రాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని, కంట్రోల్ రూమ్లను ఏర్పాటుచేసి తీర ప్రాంత ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు. టూరిస్టు ప్రాంతాలను క్లోజ్ చేశారు.
