- సున్నంచెరువు వద్ద కంటిన్యూ అవుతున్న దాడులు
- ఇప్పటికే 25 అక్రమ బోర్లు తొలగింపు
- తమ్మిడికుంటలోనూ తొలగింపు పర్వం
- నేడో, రేపో జంట జలాశయాల పరిసరాల్లో స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్ సిటీ, వెలుగు : చెరువులకు ఆనుకుని అక్రమంగా బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేస్తున్న వారిపై హైడ్రా నిఘా పెట్టింది. చెరువులు, జలాశయాల పరిసరాల్లో పెద్ద సంఖ్యలో బోర్లు వేసి నీటిని తోడడం వల్ల భూగర్భ జలమట్టాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బోర్లలో నీరు తగ్గిపోతుండటంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సి వస్తున్నది. దీంతో చెరువులు, రిజర్వాయర్ల పరిసరాల్లో నీటిని ఇష్టారాజ్యంగా వెలికితీస్తూ ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల ద్వారా వ్యాపారం చేస్తున్న నిర్వాహకులపై చర్యలకు సిద్ధమైంది. క్యూర్ యాక్ట్ అమలులోకి రావడంతో హైడ్రాకు పూర్తి అధికారాలు వచ్చాయి.
ఇదివరకు ఆక్రమణలను మాత్రమే తొలగించే అధికారం ఉండగా..క్యూర్ చట్టంతో ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి ఎన్ ఫోర్స్ మెంట్ లో అయినా జోక్యం చేసుకునే అధికారాలు వచ్చాయి. ఇందులో భాగంగా ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చెరువుల పరిసరాల్లో భూగర్భ జలాలు కాపాడేందుకు యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ప్రధానమైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరిసరాల్లో అక్రమ బోర్లపై దృష్టి పెట్టింది. నేడో, రేపో ఈ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి అక్రమంగా నీటిని తోడుతున్న బోర్లపై చర్యలు తీసుకోబోతోంది. ఇప్పటికే మాదాపూర్‌లోని సున్నం చెరువు పరిసరాల్లో 25 అక్రమ బోర్లను తొలగించిన హైడ్రా ..దాడులు కంటిన్యూ చేస్తూనే ఇతర చెరువుల వద్ద కూడా ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.
తమ్మిడికుంటలో ప్లాస్టిక్ షీట్ల కుంట..
శిల్పారామం ఎదురుగా ఉన్న తమ్మిడికుంట వద్ద సోమవారం హైడ్రా దాడులు నిర్వహించింది. దిగువ భాగంలో బోర్లు వేసి ప్లాస్టిక్ షీట్లతో తయారు చేసిన కుంటకు సరఫరా చేస్తూ ట్యాంకర్ల ద్వారా దందా చేస్తుండగా చెక్ పెట్టింది. తమ్మిడికుంట వద్ద ఆరు బోర్లను పైపులైన్లతో సహా తొలగించింది. మోటార్లను తీసేసింది. మరోవైపు సున్నం చెరువు దగ్గర కూడా సోమవారం దాడులు కొనసాగించింది. మరో 10 బోర్లను, పైపులను తొలగించింది. ఇప్పటి వరకూ సున్నం చెరువు చెంత 25 బోర్లను, తమ్మిడికుంట వద్ద ఆరు బోర్లను హైడ్రా తొలగించింది. వీటిపైనే కాకుండా మిగతా చెరువులపైనా హైడ్రా దృష్టి పెట్టింది.
