భారత్‌‌‌‌లో ఏఐ వాడకం 2030 నాటికి డబుల్‌‌‌‌ ..

భారత్‌‌‌‌లో ఏఐ వాడకం 2030 నాటికి డబుల్‌‌‌‌ ..
  • ప్రస్తుతం 22 శాతంగా ఉన్న ఏఐ వినియోగం.. 43 శాతానికి చేరుతుందని అంచనా
  • ఎరిక్సన్ కన్జ్యూమర్‌‌‌‌ ల్యాబ్ నివేదికలో వెల్లడి
  • గ్లోబల్ సగటు కంటే మన దేశంలోనే విస్తరిస్తున్న మల్టీమోడల్ టెక్నాలజీ
  • భవిష్యత్తులో అప్‌‌‌‌లోడ్ ట్రాఫిక్, హై-స్పీడ్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లకే అత్యంత డిమాండ్ 


న్యూ ఢిల్లీ: దేశంలో ఆర్టిఫిషియల్‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ (ఏఐ) రోజువారీ జీవితంలో కీలక భాగంగా మారుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిత్యం ఏఐని వినియోగిస్తున్న వారి సంఖ్య 22 శాతంగా ఉండగా, 2030 నాటికి ఇది ఏకంగా 43 శాతానికి పెరుగుతుందని ప్రముఖ టెలికాం పరిశోధనా సంస్థ ‘ఎరిక్సన్ కన్జ్యూమర్‌‌‌‌‌‌‌‌ ల్యాబ్’ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ప్రపంచ సగటు 30 శాతంతో పోలిస్తే భారత్‌‌‌‌‌‌‌‌లోనే ఏఐ ఆదరణ గణనీయంగా ఉండటం విశేషం. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 27 దేశాల్లోని 15 నుంచి 69 ఏండ్ల మధ్య వయస్కులైన 43 వేల మంది స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్ వినియోగదారుల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.

టెక్ట్స్‌‌‌‌‌‌‌‌ను దాటి మల్టీమోడల్ వైపు..

ఇప్పటివరకూ కేవలం ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకే పరిమితమైన ఏఐ, ఇప్పుడు వాయిస్, ఇమేజ్, వీడియో రూపాల్లోకి విస్తరిస్తున్నది. ప్రయాణాల్లో, వివిధ పరికరాల్లో ఏఐని వాడే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. దీనివల్ల మొబైల్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌లపై అప్‌‌‌‌‌‌‌‌లోడ్ ట్రాఫిక్ భారం తీవ్రతరం కానుందని నివేదిక పేర్కొన్నది. ఫలితంగా హై-స్పీడ్, లో-లేటెన్సీ (తక్కువ జాప్యం), అత్యధిక అప్‌‌‌‌‌‌‌‌లింక్ సామర్థ్యం గల నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌లు అత్యవసరంగా మారనున్నాయి. దేశంలో ఉన్న పటిష్టమైన డిజిటల్ మౌలిక వసతులు ఏఐ తదుపరి దశ విస్తరణకు గొప్ప వేదికని ఎరిక్సన్ ఇండియా ఎండీ నితిన్ బన్సల్ పేర్కొన్నారు.

 సొంత పనులకు ‘ఏజెంట్లు’

ఏఐని కేవలం సెర్చ్ టూల్‌‌‌‌‌‌‌‌గా కాకుండా తమ రోజువారీ పనుల్లో ఒక సహచరుడిగా ఉపయోగించే ‘సూపర్ యూజర్ల’ సంఖ్య 2030 నాటికి 10 శాతం నుంచి 30 శాతానికి చేరనుంది. మొత్తం ఏఐ కార్యకలాపాల్లో 80 శాతానికి పైగా వీరి నుంచే జరగనుంది. అంతేకాకుండా, టికెట్ బుకింగ్స్, షాపింగ్, షెడ్యూల్స్‌‌‌‌‌‌‌‌లాంటి పనులను వినియోగదారుడి తరఫున స్వయంగా పూర్తిచేసే ‘ఏజెంటిక్ ఏఐ’ వినియోగం 4 శాతం నుంచి 38 శాతానికి పెరుగుతుందని నివేదిక తెలిపింది. దీనివల్ల సగటున రోజుకు ఒక గంట స్క్రీన్ టైమ్ ఆదా అవుతుందని వినియోగదారులు భావిస్తున్నారు.

భద్రతే కీలకం

యూజర్ల తరఫున ఏఐ ఏజెంట్లే స్వతంత్రంగా వ్యవహరిస్తుండటంతో నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌లలో ‘కనిపించని సబ్‌‌‌‌‌‌‌‌స్క్రైబర్లు’ కొత్త సవాలుగా మారనున్నారు. అయితే, ఏఐ సహాయకులు నకిలీవి కావచ్చన్న లేదా హ్యాకింగ్‌‌‌‌‌‌‌‌కు గురికావచ్చన్న ఆందోళన సగానికి పైగా వినియోగదారుల్లో నెలకొన్నది. ఈ నమ్మకాన్ని కాపాడేందుకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు భద్రతా ప్రమాణాలను పటిష్టం చేయాల్సి ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది.