తెలంగాణ హైకోర్టు సీజేగా తపబ్రత చక్రవర్తి!

తెలంగాణ హైకోర్టు సీజేగా తపబ్రత చక్రవర్తి!

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తపబ్రత చక్రవర్తిని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అలాగే, ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ పి. శ్యామ్ కోషిని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని ప్రతిపాదించింది. సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి  సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం మొత్తం 4  హైకోర్టులకు కొత్త సీజేలను సిఫారసు చేసింది. 
 

ఇందులో భాగంగా గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనీష్ రంజన్ పాఠక్‌‌ను అదే హైకోర్టు సీజేగా, పట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్‌‌ సింగ్‌‌ను ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా నియమించాలని కేంద్రానికి ప్రతిపాదించింది. మధ్యప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు న్యాయవాదులను జడ్జిలుగా పదోన్నతి కల్పించాలని, బాంబే హైకోర్టులోనూ పలువురి నియామకాలను కొలీజియం సిఫారసు చేసింది. ఈ ప్రతిపాదనలను కేంద్ర న్యాయశాఖ పరిశీలించి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన అనంతరం అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.