హైదరాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్)లో ‘విజిలెన్స్ అవేర్నెస్ వీక్ – 2026’ ఘనంగా ప్రారంభమైంది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు నిర్వహించనున్న ఈ అవగాహన వారోత్సవాలను ‘సత్యనిష్ఠతో సమృద్ధి’ అనే అంశంతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఎగ్జిక్యూటివ్ వైస్- చైర్మన్, డైరెక్టర్ జనరల్ రవి గుప్తా హాజరయ్యారు.
ఈ మీటింగ్లో ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాశ్, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆశిష్ మెహ్రోత్రా సహా వివిధ విభాగాల ప్రధానాధికారులు, సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల రైల్వే మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అధికారులతో పాటు సిబ్బందితో సత్యనిష్ఠ ప్రతిజ్ఞ చేయించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘అనిమిషా’ విజిలెన్స్ బులెటిన్ 59వ సంచికను అతిథులు ఆవిష్కరించారు. ఈ సంచిక ఎస్సీఆర్ అధికారిక వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా రవి గుప్తా మాట్లాడుతూ.. నిజాయితీ అంటే కేవలం ఆర్థిక అవినీతికి దూరంగా ఉండటం మాత్రమే కాదని, నైతికంగా పనిచేస్తూ అత్యుత్తమ సేవలను అందించడమేనని స్పష్టం చేశారు. ఎక్కడ సత్యనిష్ఠ ఉంటుందో అక్కడ విశ్వాసం, అభివృద్ధి, నిజమైన శ్రేయస్సు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
