- సమావేశంలో అంతర్జాతీయ రాయబారులు, గ్లోబల్ సీఈవోలు
- సీఐఐ, ఇన్వెస్ట్ ఇండియా భాగస్వామ్యంతో సదస్సు
హైదరాబాద్, వెలుగు: 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’ ప్రచారంలో భాగంగా ఈనెల 29న ఢిల్లీలో ‘కర్టెన్ రైజర్’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, వివిధ దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, విదేశీ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీల అధిపతులు, బహుళజాతి కంపెనీల సీఈవోలు హాజరుకానున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, సరికొత్త రాయితీలు, భవిష్యత్ అభివృద్ధి కార్యాచరణను గ్లోబల్ ఇన్వెస్టర్లకు వివరించేందుకు ఈ వేదికను ప్రభుత్వం కీలకంగా మలచుకోనుంది. ఈ సదస్సును కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), ఇన్వెస్ట్ ఇండియా సంస్థలు భాగస్వాములుగా వ్యవహరించనున్నాయి.
అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తైవాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఇండో-కెనడా బిజినెస్ ఛాంబర్ల ఉన్నత స్థాయి ప్రతినిధులు, అగ్రగామి స్టార్టప్‌ల వ్యవస్థాపకులు తరలిరానున్నారు. గ్లోబల్ సమ్మిట్‌ను ప్రపంచ పారిశ్రామిక వర్గాల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు రాష్ట్ర అధికార యంత్రాంగం ఇప్పటికే పలు దేశాల్లో అంతర్జాతీయ రోడ్‌షోలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
వీటితో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన మెట్రో నగరాల్లోనూ ‘ఇన్వెస్ట్ తెలంగాణ’కు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఈ కర్టెన్ రైజర్ వేదికగా హైదరాబాద్ నగరానికి ఉన్న బలాలు, తెలంగాణ పారిశ్రామిక నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పనున్నారు.
ఇప్పటికే అంతర్జాతీయ ఫార్చ్యూన్-2000 జాబితాలోని 165కు పైగా దిగ్గజ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దేశంలో అత్యంత నివాసయోగ్యమైన (మోస్ట్ లివబుల్) నగరాల జాబితాలో వరుసగా నిలిచిన ఘనతను ప్రత్యేకంగా ప్రెజెంట్ చేయనున్నారు.
