హైదరాబాద్, వెలుగు: దేశంలోనే అత్యల్ప విద్యుత్ ప్రసార నష్టాలను నమోదు చేసినందుకు గానూ రాష్ట్ర ట్రాన్స్ కో ప్రతిష్టాత్మక అవార్డును కైవసం చేసుకుంది. 2025-–26 ఆర్థిక సంవత్సరానికి గానూ సంస్థకు ఈ పురస్కారం దక్కింది. వరుసగా రెండో ఏడాది కూడా టీజీ ట్రాన్స్ కో ఈ అవార్డును అందుకోవడం విశేషం. యశోభూమిలో అక్టోబర్ 24న జరిగిన కార్యక్రమంలో గ్రిడ్ అండ్ ట్రాన్స్మిషన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ జి. సంపత్ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. పవర్ లైన్ మ్యాగజైన్ సీఈఓ అలోక్ కె. బ్రారా, గ్రిడ్-ఇండియా వ్యవస్థాపక సీఈఓ ఎస్.కె.సోని చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
అద్భుతమైన ప్రతిభ కనబరిచినందుకు, రాష్ట్రంలో 20,018 మెగావాట్ల రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్ ను విజయవంతంగా అధిగమించినందుకు గానూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్రాన్స్ కో ఇంజనీర్లు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
