నర్మదా నది ఒడ్డున ఓటర్ కార్డులు..మూడు రాష్ట్రాల్లో ఓటర్ల లిస్టులపై రాజకీయ దుమారం

నర్మదా నది ఒడ్డున ఓటర్ కార్డులు..మూడు రాష్ట్రాల్లో ఓటర్ల లిస్టులపై రాజకీయ దుమారం
  • కర్నాటకలో 4 నెలల్లో 2.28 లక్షల ఫామ్‌‌‌‌‌‌‌‌-7 దరఖాస్తులు
  • యూపీలో ఫామ్‌‌‌‌‌‌‌‌- 6, 7, 8 పై ఆడిట్‌‌‌‌‌‌‌‌కు సీఈవో ఆదేశాలు
  • మూడు రాష్ట్రాల పరిణామాలతో ఈసీపై కాంగ్రెస్ విమర్శలు

న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో నర్మదా నది ఒడ్డున 343 ఓటర్ ఐడీ కార్డులు దొరకడం, కర్నాటకలో ఓటర్ల పేర్ల తొలగింపునకు 2.28 లక్షల ఫామ్‌‌‌‌‌‌‌‌-7 దరఖాస్తులు రావడం, ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో ఓటర్ల నమోదు, తొలగింపు దరఖాస్తులపై ఆడిట్‌‌‌‌‌‌‌‌కు ఆదేశాలివ్వడం కలకలం రేపాయి. ఈ పరిణామాలపై ఎన్నికల సంఘం జవాబుదారీతనాన్ని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని ఖర్గోన్ జిల్లా మండలేశ్వర్ ఘాట్ వద్ద ఆదివారం నర్మదా నది ఒడ్డున 343 ఓటర్ ఐడీ కార్డులు కనిపించాయి. వీటిని ఇండోర్‌‌‌‌‌‌‌‌లోని రావు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినవిగా గుర్తించారు. ఇండోర్ నుంచి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఈ కార్డులు దొరకడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

రెవెన్యూ అధికారులు వాటిని స్వాధీనం చేసుకోగా, మండలేశ్వర్ ఎస్‌‌‌‌‌‌‌‌డీవో పోలీస్ శ్వేతా శుక్లా దర్యాప్తునకు ఆదేశించారు. కార్డులు అక్కడికి ఎలా చేరాయి? ఎవరు పడేశారు? అనే అంశాలపై విచారణ జరపాలని కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓట్ల చోరీకి సంబంధించిన ఆధారాలు రోజురోజుకూ బయటపడుతున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఇండోర్ ఓటర్ ఐడీలు మహేశ్వర్‌‌‌‌‌‌‌‌కు ఎలా వచ్చాయని, వాటిని ఎవరు పడేశారని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నించింది. ఈసీ నిష్పక్షపాతంగా విచారణ జరుపుతుందా అని నిలదీసింది.

ఆ 2 రాష్ట్రాల్లో ఫామ్‌‌‌‌‌‌‌‌-7 లొల్లి

ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో ఎస్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియ ముగిసిన ఏప్రిల్ 10 నుంచి కంప్యూటర్ అసిస్టెంట్లు నమోదు చేసిన ఫామ్‌‌‌‌‌‌‌‌-6, 7, 8 దరఖాస్తులపై సమగ్ర ఆడిట్ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా ఆదేశించారు. పిలిభిత్, ఆజంగఢ్ జిల్లాల్లో అక్రమాలు జరిగినట్లు వార్తలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కర్నాటకలో జూన్ 16 నుంచి అక్టోబర్ 22 వరకు 2,28,917 ఫామ్‌‌‌‌‌‌‌‌-7 దరఖాస్తులు వచ్చినట్లు ఎన్నికల సంఘం లెక్కలు వెల్లడిస్తున్నాయి. 

ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుపై అభ్యంతరం తెలపడానికి లేదా పేర్ల తొలగింపును కోరడానికి ఈ ఫామ్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగిస్తారు. అయితే, బీజేపీ ఫామ్‌‌‌‌‌‌‌‌-7ను దుర్వినియోగం చేస్తూ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ అంశంపై సీఎం డీకే శివకుమార్ కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మూడు రాష్ట్రాల్లోని పరిణామాలతో ఎన్నికల సంఘం పారదర్శకతపై విమర్శలు మరింత పెరిగాయి.