భారతీయులు విధ్వంసానికి పాల్పడరు.. ఐరోపాలో ఆందోళనల వేళ పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు

భారతీయులు విధ్వంసానికి పాల్పడరు.. ఐరోపాలో ఆందోళనల వేళ పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు

బెర్లిన్: విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తమ శాంతియుత ప్రవర్తన, కుటుంబ విలువలు, చట్టబద్ధతతో ఎంతో గౌరవాన్ని సంపాదించుకున్నారని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కొనియాడారు. ఐరోపాలోని ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ వంటి పలు దేశాల్లో జరుగుతున్న ఆందోళనలు వస్తువులు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి దారితీస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల జర్మనీ పర్యటనలో భాగంగా బెర్లిన్‌‌‌‌‌‌‌‌లో ఎన్ఆర్ఐలు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గోయల్ ప్రసంగించారు. ‘ప్రవాస భారతీయులు శాంతిప్రియులు. తమ కుటుంబాలతో కలిసి జీవిస్తూ, సమాజ శ్రేయస్సును కోరుకుంటారు. ఎక్కడా విధ్వంసాలకు పాల్పడరు. రోడ్లపైకి వచ్చి ప్రజాజీవనానికి అంతరాయం కలిగించరు. కాబట్టే ఆతిథ్య దేశాల్లో వారికి మంచి 
స్వాగతం లభిస్తుంది. అక్కడ వారు ఎంతో గౌరవాన్ని పొందుతున్నారు’ అని పేర్కొన్నారు.

స్టూడెంట్లకు అండగా ఉండండి

జర్మనీకి వచ్చే భారతీయ విద్యార్థులకు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన వారికి సహాయం అందించాలని ప్రవాసీలకు గోయల్ విజ్ఞప్తి చేశారు. కొత్త వాతావరణంలో సర్దుబాటు చేసుకోవడానికి ఇది వారికి ఉపయోగపడుతుందని తెలిపారు. విదేశాల్లోని భారతీయ కార్మికులు, ఉద్యోగుల కష్టపడే తత్త్వాన్ని ఆయన అభినందించారు. భారత్, -జర్మనీల మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఎన్ఆర్ఐల పాత్ర కీలకమని అన్నారు. ఇక తన పర్యటనలో భాగంగా పీయూష్ గోయల్ జర్మనీ ప్రభుత్వ ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పరిశోధనా సంస్థల ప్రతినిధులతో సమావేశయ్యారు. ఈసందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, అధునాతన తయారీ రంగాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో సహకారంపై చర్చలు జరిపారు.