- దేశవ్యాప్తంగా 2.2 లక్షలకు చేరిన ఇన్ఫెక్షన్లు
- ప్రమాదకర వ్యాధుల ముప్పుపై నిపుణుల హెచ్చరిక
ఢాకా: బంగ్లాదేశ్‌లో గత మార్చి నుంచి తట్టు (మీజిల్స్) మహమ్మారి దేశాన్ని వణికిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వ్యాధి బారినపడి ఇప్పటివరకు 1,200 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, 2.2 లక్షల మందికి పైగా ఇన్ఫెక్షన్ సోకింది. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే, మీజిల్స్‌కు కొనసాగింపుగా డిఫ్తీరియా, ఊపిరిసలుపు దగ్గు (హూపింగ్ కఫ్), పోలియో వంటి ఇతర వ్యాధులు కూడా విజృంభించే ప్రమాదముందని నిపుణులు హెచ్చరించారు. ఈ అంశంపై జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో కూడిన కమిటీ అక్టోబర్‌లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దేశంలో ఇమ్యునైజేషన్ (రోగ నిరోధక) వ్యవస్థ బలహీనపడుతోందనడానికి ఈ వ్యాప్తి ఒక హెచ్చరిక అని, తక్షణ నివారణ చర్యలు చేపట్టకపోతే మరిన్ని ప్రమాదకర వ్యాధులు ప్రబలుతాయని నివేదికలో పేర్కొంది. ఈ సిఫార్సుల మేరకు వీలైనంత త్వరగా వ్యాక్సినేటర్లను నియమించనున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
కేవలం 82 శాతం మంది పిల్లలకే టీకాలు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ తదితర భాగస్వామ్య సంస్థల మద్దతుతో నిర్వహించిన సమీక్షలో పలు ఆందోళనకర విషయాలు వెలుగుచూశాయి. దేశంలో 82% మంది పిల్లలకు మాత్రమే పూర్తిస్థాయిలో టీకాలు అందాయి. ఇది జాతీయ లక్ష్యమైన 95 శాతాని కంటే చాలా తక్కువ.
దగ్గు, తుమ్ముల ద్వారా వేగంగా వ్యాప్తి..
గతంలో పోలియో, టెటానస్ను బంగ్లాదేశ్ విజయవంతంగా నిర్మూలించింది. 2024లో మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసిన విప్లవం, ఆ తర్వాత 2025లో తలెత్తిన రాజకీయ అస్థిరత, సమ్మెల కారణంగా వ్యాక్సినేషన్ అర్థాంతరంగా నిలిచిపోయింది. అధికారులు ప్రస్తుతం సామూహిక టీకా డ్రైవ్‌ను చేపట్టినప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దగ్గు, తుమ్ముల ద్వారా తట్టు వేగంగా వ్యాపిస్తోందని, దీనికి నిర్దిష్ట చికిత్స లేకపోవడంతో పిల్లలు ప్రాణాపాయంలో పడుతున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
