కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీకి 300 ఎకరాలు ఎలా వచ్చాయి..ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే: మంత్రి వివేక్

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీకి 300  ఎకరాలు ఎలా వచ్చాయి..ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే: మంత్రి వివేక్
  • కమీషన్ల కక్కుర్తితోనే కాళేశ్వరం కూలింది
  • తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే  కరువు రాకపోయేది
  • చెన్నూరులో గోదావరి పుష్కరాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన


కోల్​బెల్ట్/చెన్నూరు, వెలుగు: పదేండ్లలో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కుటుంబానికి 300 ఎకరాల భూములు ఎలా వచ్చాయో, వేల కోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి డిమాండ్ ​చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడి నాణ్యతను గాలికి వదిలేయడం వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిందని ఆరోపించారు. 

కాంగ్రెస్​జమానాలో కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఉన్నాయని, మేడిగడ్డ మాత్రం మూడేండ్లకే కుప్పకూలిందన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, జైపూర్​ మండలాల్లో  మంత్రి  పర్యటించారు. 

గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా  కలెక్టర్​ కుమార్​ దీపక్​తో కలిసి పలు  అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చెన్నూరులో రూ.3.50 కోట్లతో సీసీ రోడ్డు, రూ.50 లక్షలతో హైమాస్ట్​ లైటింగ్, రూ.6 కోట్లతో బీటీ రోడ్డు విస్తరణ పనులు, జైపూర్​ మండలం వేలాల వద్ద రూ.4.25కోట్లతో పుష్కరాఘాట్​నిర్మాణ పనులను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ కాకా వెంకటస్వామి సూచనతో  వైఎస్సార్‌‌‌‌‌‌‌‌ హయాంలో తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత-, చేవేళ్ల ప్రాజెక్టు ప్రారంభించారని, బీఆర్ఎస్​ఈప్రాజెక్టును  కట్టి ఉంటే ఎల్ నినో కరువు వచ్చేదే కాదన్నారు. 

మేడిగడ్డ ప్రారంభించిన తర్వాత 160 టీఎంసీలను పంప్​ చేస్తే  అందులో   70 టీఎంసీలు కిందికి వదలడంతో  సముద్రం పాలయ్యాయన్నారు.  లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీళ్లివ్వకున్నా.. కేసీఆర్​ తన ఫాంహౌస్​కు మాత్రం అక్రమంగా నీళ్లు మళ్లించుకున్నాడని ఫైర్​ అయ్యారు.  పాండురంగసాగర్​ చెరువు తవ్వించుకుని,  కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశాడని మండిపడ్డారు.

చెన్నూరును  రోల్​మోడల్​గా తీర్చిదిద్దుతా 

చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, యువత, మహిళలకు ఉపాధి కల్పిస్తానని మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌ అన్నారు. రోడ్డు విస్తరణలో షాపులు కోల్పోయిన చిరు వ్యాపారుల కోసం రూ.1.2 కోట్లతో దుకాణాలు నిర్మిస్తున్నామని, మరో 50 షాపులు కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

 రూ.17 కోట్లతో శివాలయ అభివృద్ధి,  జైపూర్​ మండలం శివ్వారంలోని మొసళ్ల మడుగు, గాంధారీ ఖిల్లా అభివృద్ధి ద్వారా పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దుతామన్నారు.  జైపూర్‌‌‌‌‌‌‌‌ సింగరేణి థర్మల్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో 850 మెగావాట్ల మూడో యూనిట్‌‌‌‌‌‌‌‌ నిర్మాణం కొనసాగుతోందని, రామకృష్ణాపూర్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌కాస్ట్‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌-2కు నాలుగైదు నెలల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉందన్నారు. 

ఈ ప్రాజెక్టులతో సుమారు 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. అంతకుముందు ఉదయం మార్నింగ్ వాక్​ నిర్వహించి స్థానికులు, వాకర్స్​ సమస్యలు అడిగితెలుసుకున్నారు. అనంతరం వివిధ కారణాలతో మృతిచెందిన వారి  కుటుంబాలను పరామర్శించారు. 

మంత్రి వెంట డీసీపీ భాస్కర్, ఏసీపీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు మల్లికార్జున్, వనజారెడ్డి, ఎంపీడీవో శ్రీపతి బాపు, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, మున్సిపల్ చైర్ పర్సన్ పెద్దింటి పద్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ తివారి, లీడర్లు పాల్గొన్నారు.
 

 ఆదివాసీలకు ఆదర్శం కుమురం భీం


జల్‌‌‌‌‌‌‌‌-–జంగల్‌‌‌‌‌‌‌‌–-జమీన్‌‌‌‌‌‌‌‌ నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కుమురం భీం ఆశయాలను కొనసాగిద్దామని మంత్రి వివేక్​ వెంకటస్వామి  పిలుపునిచ్చారు. సోమవారం జైపూర్‌‌‌‌‌‌‌‌ మండల కేంద్రంలో నిర్వహించిన కొమురం భీం వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

కార్యక్రమంలో ఆదివాసీ నాయక్​పోడ్​హక్కుల పరిరక్షణ కమిటీ  రాష్ట్ర అధ్యక్షుడు గంజి రాజన్న, జిల్లా జనరల్​ సెక్రటరీ భీమిని సంజీవ్, వర్కింగ్​ ప్రెసిడెంట్​ బైరినేని అశోక్, మండల అధ్యక్షుడు బిస్కూల రవి, సర్పంచి కూన భాస్కర్​ తదితరులు  పాల్గొన్నారు.