చెరువులు దాటి, గుట్టలు ఎక్కి.. రామగిరి ఖిల్లాపై 10 కిలోమీటర్లు నడిచిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

చెరువులు దాటి, గుట్టలు ఎక్కి.. రామగిరి ఖిల్లాపై 10 కిలోమీటర్లు నడిచిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  •     తక్కువ టైంలో ట్రెక్కింగ్ పూర్తి చేస్తే స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఇస్తానని ఆఫర్  


కరీంనగర్/రామగిరి, వెలుగు: ప్రకృతి రమణీయతకు పెట్టని కోటగా ఉన్న రామగిరి ఖిల్లాపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ  సోమవారం అడ్వెంచర్ చేశారు. ఇటీవల రామగిరి ఖిల్లాకు  రోప్‌‌‌‌‌‌‌‌వే (రూ.5 కోట్లు) మంజూరు చేయించిన ఆయన.. క్షేత్రస్థాయిలో పర్యాటక అవకాశాలను పరిశీలించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ఖిల్లాకు చెందిన 7 గేట్లు, రెండు చెరువులను దాటి, నాలుగు గుట్టలను ఎక్కి సాహసోపేతంగా ఖిల్లా పైభాగానికి చేరుకుని అక్కడి శివాలయం, శ్రీరామచంద్ర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. కోట బురుజులు, పసరు బావి, పిల్లల ఫిరంగులు, బందీఖానాలను చూసి వాటి చరిత్ర తెలుసుకున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు 10 కిలోమీటర్ల మేర సాగిన ఈ ట్రెక్కింగ్‌‌‌‌‌‌‌‌లో చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాలు, ప్రకృతి అందాలను పరిశీలించారు. తక్కువ టైంలో ట్రెక్కింగ్ పూర్తి చేస్తే వన్‌‌‌‌‌‌‌‌ప్లస్ స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఇస్తానని యువతకు ఆఫర్ ప్రకటించారు.  

రోప్ వే మంజూరుపై ప్రజల హర్షం

రోప్ వే మంజూరు చేయించినందుకు స్థానికులు ఎంపీ వంశీకృష్ణను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రామగిరి ఖిల్లా తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోందని, ఇక్కడి పురాతన ఆలయాలు, కోట నిర్మాణాలు, ప్రకృతి అందాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ఆయన చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ రామగిరి ఖిల్లా విశిష్టత, చరిత్ర భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రామగిరి ఖిల్లా, ధర్మపురి, కోటిలింగాల ఆలయాలను టూరిస్ట్ హబ్ గా మారుస్తామని వెల్లడించారు. అనంతరం మంథనిలో పలు మృతుల కుటుంబాలను పరామర్శించారు.  

విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ

మల్హర్, వెలుగు: అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెంకుంట గ్రామంలో పర్యటించి అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం రూ. 20 లక్షలు మంజూరు చేశారు. అనంతరం అక్కడే ఉన్న త్రిశక్తి పీఠం ఆలయంలో  ప్రత్యేక పూజలు చేశారు. కొయ్యూరు గ్రామ పరిధిలోని రోడ్డు నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేశారు. అనంతరం విశాక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు బ్యాగులను అందించారు. అనంతరం వారితో మాట్లాడారు. స్కూల్ పిల్లల కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ఎంపీ వెంట నాయకులు దేవి భూమయ్య, కొయ్యూరు ఉప సర్పంచ్ సవేందర్ నాయక్, మాల మహానాడు లీడర్లు ఉన్నారు