హైదరాబాద్, వెలుగు: వాతావరణ మార్పుల నుంచి ప్రపంచ ఆహార వ్యవస్థలను రక్షించడానికి ఏఐ సేవలను వ్యవసాయ రంగంలో విస్తృతంగా వినియోగించనున్నారు. గూగుల్ డీప్‌మైండ్, గూగుల్ డాట్ ఆర్గ్ సంస్థలు హైదరాబాద్‌కు చెందిన ఇక్రిశాట్, హడ్సన్ ఆల్ఫా ఇన్స్టిట్యూట్, వాషింగ్టన్ యూనివర్సిటీతో కలిసి కొత్త ప్రాజెక్టును చేపట్టాయి.
వాతావరణాన్ని తట్టుకుని పెరిగే జొన్నల వంటి పోషక విలువలున్న పంటలను అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా 90 దేశాల నుంచి సేకరించిన 44 వేల రకాల విత్తనాలతో ఓపెన్ యాక్సెస్ జెనెటిక్ అట్లాస్‌ను రూపొందిస్తున్నారు. మెషిన్ లెర్నింగ్ సాయంతో అత్యుత్తమ వంగడాలను గుర్తించి రైతులకు మేలు జరిగేలా పరిశోధనలు చేస్తున్నారు.
పంటల జన్యువులను విశ్లేషించేందుకు గూగుల్ డీప్‌మైండ్ ఇక్రిశాట్లో మూడేళ్ల పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌ను కూడా ప్రారంభించింది. శాస్త్రవేత్తలు, చిన్న వ్యాపారులు, విద్యార్థులకు మేలు చేసేలా ఏఐ సాంకేతికతను విస్తరించడమే ఈ భాగస్వామ్యాల లక్ష్యం.
