మండలి పోరులో సీపీఎం డబుల్‌‌‌‌ వ్యూహం!..ఒక స్థానంలో సొంతంగా పోటీ

మండలి పోరులో సీపీఎం డబుల్‌‌‌‌ వ్యూహం!..ఒక స్థానంలో సొంతంగా పోటీ
  •     మరోచోట బీజేపీ వ్యతిరేక శక్తులకు మద్దతు  
  •     నేడు వామపక్షాలతో భేటీ తర్వాత అభ్యర్థి పేరు ప్రకటన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో జరగనున్న శాసనమండలి ఎన్నికల పోరుకు వామపక్షాలు సమాయత్తం అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీపీఎం పార్టీ క్లారిటీకి వచ్చింది. లెఫ్ట్ పార్టీలుగా కలిసి పోటీ చేద్దామని సీపీఎం.. సీపీఐకి విజ్ఞప్తి చేసింది. ఈ ఎన్నికల్లో వామపక్షాలన్నీ ఒకే తాటిపైకి రావాలని, ఉమ్మడిగా పోరాడితే విజయావకాశాలు ఉంటాయని పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్‌‌‌‌తో దోస్తీ కొనసాగిస్తున్న సీపీఐ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌‌‌‌ వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల మద్దతుపై ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. దాదాపుగా కాంగ్రెస్​తో కలిసి వెళ్లేందుకే సిద్ధమైనట్లు సమాచారం. కాగా, గత ఎన్నికల అనుభవాలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ సమీకరణాలను బేరీజు వేసుకుంటూ సీపీఎం పక్కా ప్లాన్‌‌‌‌తో బరిలోకి దిగుతోంది. ఇందులో భాగంగా సీపీఎం డబుల్ స్ట్రాటజీని ఎంచుకుంది. తమకు బలమున్న ఒక స్థానంలో సొంతంగా అభ్యర్థిని నిలబెట్టాలని.. మరో స్థానంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా బీజేపీ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. 

కమ్యూనిస్టులకు కాస్త పట్టు ఉన్న ఉమ్మడి నల్గొండ–వరంగల్‌‌‌‌–ఖమ్మం స్థానంలో అభ్యర్థిని నిలిపేందుకు రెడీ అయ్యింది. ఖమ్మం జిల్లా నుంచి సీనియర్​లాయర్, నల్గొండ జిల్లా నుంచి టీచర్​యూనియన్​లీడర్ పేర్లు వినిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరిని బరిలో నిలపనున్నారు. మంగళవారం ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటనపై అధికారిక ప్రకటన చేస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన సీపీఎం.. ఇతర లెఫ్ట్ పార్టీలతో మంగళవారం ఉదయం సమావేశం నిర్వహించనుంది. న్యూడెమోక్రసీ, ఇతర వామపక్షాలతో చర్చించి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే లెఫ్ట్​పార్టీల మద్దతుపై క్లారిటీ వచ్చినా మళ్లీ  భేటీ కానున్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున నల్గొండ–వరంగల్‌‌‌‌–ఖమ్మం అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. మరో స్థానంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఈ సమావేశంలో స్పష్టత ఇవ్వనున్నారు.