- కేంద్రం నుంచి కరువు నిధులు రాబట్టేలా ఒత్తిడి తేవాలి
హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినోపై అఖిలపక్షం, రైతు సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఎకరానికి వరికి రూ.30 వేలు, పత్తి, మిర్చికి రూ.50 వేల పరిహారమివ్వాలని పేర్కొంది. సోమవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో జరిగిన సీపీఐ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు కరువు పరిస్థితులపై తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, రాష్ట్ర సమితి ఏకగ్రీవంగా ఆమోదించింది.
ప్రాజెక్టుల్లో నీటి నిల్వల వాస్తవ లభ్యతపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, తాగునీటి సమస్య రాకుండా గ్రామ పంచాయతీలకు వెంటనే ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. కౌలు రైతులను విధిగా గుర్తించి నష్టపరిహారం వర్తింపజేయాలన్నారు. వ్యవసాయ కూలీలు, కౌలు రైతులకు అదనపు పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
