హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ చేసిన తప్పిదాలతోనే నీటి వాటాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. గోదావరి నీటిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని, ఈ నీటిని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వమే వాడుకుంటుందన్నారు. ఆంధ్రకు ఇక్కడి నుంచి నీళ్లు పోవడం లేదన్నారు.
పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బొగ్గు, విద్యుత్తు, నీటి విషయంలో నిజాయితీ, చిత్తశుద్ధి లేకపోవడం వల్లే తెలంగాణలో ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీశ్ నిత్యం సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. గడ్డం, మీసం పెంచుకొని మాట్లాడినంత మాత్రాన తెలంగాణ జనం కేటీఆర్ ను నమ్మరని చామల ఎద్దేవా చేశారు.
