హైదరాబాద్, వెలుగు : మత్స్యకార సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లలో వివరణ ఇవ్వాలంటూ నలుగురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు ఎన్నికలపై 3 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని, అప్పటివరకు పర్సన్ ఇన్‌ఛార్జిల నియమాకం చేపట్టరాదంటూ జులై ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో సాదు రఘు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టి ప్రతివాదులైన సీఎస్ సంజయ్‌జాజు, వ్యవసాయశాఖ, పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖల ముఖ్యకార్యదర్శులు సురేంద్రమోహన్, ఇలంబర్తి, నిఖిలతోపాటు సహకార శాఖ విభాగం ఎన్నికల అధికారి చంద్రమోహన్‌రెడ్డిలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను నవంబరు 20కి వాయిదా వేశారు.
