యువత ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత పార్లమెంట్లదే: లోక్‌‌‌‌‌‌‌‌సభ స్పీకర్ ఓం బిర్లా

యువత ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత పార్లమెంట్లదే: లోక్‌‌‌‌‌‌‌‌సభ స్పీకర్ ఓం బిర్లా

న్యూఢిల్లీ: యువత ఆశలు, ఆకాంక్షలకు అర్థవంతమైన అవకాశాలు కల్పించి, వారి ప్రతిభ వెల్లివిరిసేలా తగిన వాతావరణం సృష్టించాల్సిన గురుతర బాధ్యత పార్లమెంట్లపై ఉందని లోక్‌‌‌‌‌‌‌‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టంచేశారు. సోమవారం ఢిల్లీలో జరిగిన 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్‌‌‌‌‌‌‌‌ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. నేటి యువత మెరుగైన విద్య, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు సమాజానికి ఏమైనా చేయాలనే తపనతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 

వారి శక్తి సామర్థ్యాలను దేశ నిర్మాణానికి అనుకూలంగా మలచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. యువత కేవలం వ్యక్తిగత భవిష్యత్తు కోసమే కాకుండా, దేశాల ఉమ్మడి గమ్యానికి చిహ్నమని ఓం బిర్లా అభివర్ణించారు. ప్రజలలో మారుతున్న ఆశయాలకు అనుగుణంగా పార్లమెంట్లు నిరంతరం మారుతూ ఉండాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధమైన అధికారాలే కాకుండా, ప్రజలతో మమేకమవడం, పారదర్శకతను కాపాడడం, నిర్మాణాత్మక చర్చలకు వేదికగా నిలవడంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థల అసలు బలం దాగివుందని ఆయన గుర్తుచేశారు. 

కేవలం సాంకేతికతను అలవాటు చేసుకోవడమే కాకుండా, ప్రజాస్వామ్య సంస్థలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చే వినూత్న ఆలోచనలను పార్లమెంట్లు స్వాగతించాలని స్పీకర్ సూచించారు. మార్పులను స్వీకరించడం ద్వారా ప్రజల అంచనాలకు తగినట్లుగా ప్రజా ప్రతినిధులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.