- నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో నీటి కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. సోమవారం నీటి సమస్యపై మిషన్ భగీరథ, ట్రిపుల్ ఐటీ, గ్రామ పంచాయతీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి నది వద్ద ఉన్న పంప్‌హౌస్‌లో మూడు మోటార్లకు రెండు పనిచేయడం లేదని, ప్రస్తుతం ఒక మోటారు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
దెబ్బతిన్న మోటార్ల మరమ్మతులకు రూ.8 లక్షలు కేటాయించామని, పనులు వెంటనే ప్రారంభించినట్లు వెల్లడించారు. అదనంగా మరో మూడు 60 హెచ్‌పీ మోటార్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
క్యాంపస్‌లో విద్యార్థులు, సిబ్బందికి రోజుకు 25 లక్షల లీటర్ల నీరు అవసరం కాగా, ప్రస్తుతం 10 లక్షల లీటర్లు మాత్రమే సరఫరా అవుతోందని తెలిపారు. ఐదు రోజుల్లోగా తరగతులు యథావిధిగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే యూనివర్సిటీలోని 30 ఎకరాల వాటర్ స్టోరేజ్ చెరువును పునరుద్ధరించి నీటిని నిల్వ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
సదర్మాట్ ఆయకట్టుకు నీరు..
రైతుల పంటలకు అవసరమైన సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. సోమవారం సాయంత్రం మామడ మండలం పొన్కల్ సదర్మాట్ బ్యారేజీ, ఖానాపూర్ మండలం మేడంపల్లి, కడెం మండలం కొత్త మద్దిపడగ, పాత మద్దిపడగ గ్రామాల్లోని చివరి ఆయకట్టు పంటలను పరిశీలించారు.
ఈ సందర్భంగా సదర్మాట్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం, ప్రస్తుత నీటి నిల్వల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీలో ప్రస్తుతం ఒక టీఎంసీ నీరు అందుబాటులో ఉందని, పంటలు కోత దశకు చేరుకున్నందున లభ్యమైన నీటిని అవసరమైన మేరకు అందిస్తామని తెలిపారు.
