సబ్సిడీ శనగ విత్తనాల పంపిణీలో గోల్మాల్.. ప్రజావాణిలో ఆదిలాబాద్ కలెక్టర్కు ఫిర్యాదు చేసిన రైతులు

సబ్సిడీ శనగ విత్తనాల పంపిణీలో గోల్మాల్.. ప్రజావాణిలో ఆదిలాబాద్ కలెక్టర్కు ఫిర్యాదు చేసిన రైతులు

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు : రైతులకు రాయితీపై అందించే శనగ విత్తనాలను ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారని మర్లపెల్లి గ్రామ రైతులు ఫిర్యాదు చేశారు. సోమవారం ఆదిలాబాద్​ కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ రాజర్షి షాకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

రైతులు కామాజి రామస్వామి, భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. బోథ్ మండలానికి ప్రభుత్వం 400 బ్యాగుల సబ్సిడీ శనగ విత్తనాలను మంజూరు చేసింది. 50 శాతం రాయితీతో 25 కిలోల బస్తాను రూ.1,500కు విక్రయించాల్సి ఉండగా, రూ.1,800 నుంచి రూ.2,000 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 

ఈ విషయంపై బోథ్ మండల వ్యవసాయ అధికారి రవితేజను ప్రశ్నించగా, రూ.1,800 చెల్లించి విత్తనాలు తీసుకెళ్లాలని సూచించినట్లు రైతులు తెలిపారు. రసీదుల గురించి అడగగా, ఆధార్, పట్టాదారు పాస్‌‌‌‌‌‌‌‌బుక్ వివరాలతో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో నమోదు అవుతాయని చెప్పినట్లు పేర్కొన్నారు.

 అధిక ధరల విషయాన్ని జిల్లా వ్యవసాయ అధికారికి వాట్సాప్ ద్వారా తెలియజేయడంతో స్పందించిన మర్లపెల్లి ఏఈవో రైతుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.4,500ను ఫోన్‌‌‌‌‌‌‌‌పే ద్వారా తిరిగి చెల్లించినట్లు బాధితులు తెలిపారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని కలెక్టర్ సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు.