- మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, ధనసరి సీతక్క
- జోడేఘాట్‌లో ఘనంగా కుమ్రం భీమ్ 86వ వర్ధంతి
మంచిర్యాల, వెలుగు: ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, స్వయంపాలన కోసం కుమ్రం భీమ్ పోరాడారని, ఆయన త్యాగం, పోరాటస్ఫూర్తి చిరస్మరణీయమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు.
కుమ్రం భీమ్ 86వ వర్ధంతి సందర్భంగా సోమవారం కెరమెరి మండలం జోడేఘాట్‌లో భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దర్బార్‌లో మంత్రులు మాట్లాడారు. ఆదివాసీలు, గిరిజనుల సంక్షేమం, ఏజెన్సీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిలు, తాగునీరు తదితర మౌలిక వసతులను మెరుగుపరుస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.
ఐటీడీఏలకు పూర్వ వైభవం తీసుకొస్తామని, పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన గిరిజనులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ఆశ్రమ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.
సరిహద్దులోని మహారాష్ట్ర ఆదివాసీ ప్రాంతాల్లో అమలవుతున్న పథకాలు, అటవీహక్కులను స్టడీ చేసేందుకు అధికారుల కమిటీని అక్కడకు పంపిస్తామన్నారు. కుమ్రం భీమ్ పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మంత్రి సీతక్క కొనియాడారు.
భీమ్ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అన్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే అధికారులు మానవత్వంతో, అంకితభావంతో వ్యవహరించాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాకు సుమారు 8వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్టు చెప్పారు. ఈ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి రూ.5 కోట్లు, రహదారుల అభివృద్ధికి రూ.180 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
ఎస్టీఎఫ్‌డీ, జన్‌మన్, ఆర్టికల్ 275(1) తదితర కార్యక్రమాల కింద కేంద్రం ఇస్తున్న నిధులను సమర్థవంతంగా వినియోగించాలని ఆదిలాబాద్ ఎంపీ జి.నగేశ్సూచించారు. ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో ఉద్యోగాల్లో గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు.
ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్‌బాబు, వెడ్మ బొజ్జు, ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత, ఎస్పీ నిఖితా పంత్, ఉట్నూర్ ఐటీడీఏ పీవో మంద మకరందు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో గుస్సాడీ, చిన్నారుల సంప్రదాయ నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. లబ్ధిదారులకు మంత్రులు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలను అందజేశారు.
ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. అంతకుముందు వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రులు, అధికారులు సందర్శించారు. కుమ్రం భీమ్ మనుమడు సోనేరావు, అడిషనల్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ జోయల్ పాల్గొన్నారు.
