- రాష్ట్ర ఏర్పాటు సమయంలో సర్కారుకు లిక్కర్ ఆదాయం
- రూ.10 వేల కోట్లు.. ఇప్పుడు రూ.42 వేల కోట్లకు చేరింది
- నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపాలని చెబితే సర్కారు వినట్లే
- ఉద్యోగుల జీతాలకే నిధులన్నీ ఖర్చయితే.. అభివృద్ధికి ఎట్లా?
- లోకసత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ
వరంగల్, వెలుగు: రాష్ట్రంలో మద్యం చావులు ఆందోళన కలిగిస్తున్నాయని, యువత మద్యాన్ని, మాదకద్రవ్యాలను విచ్చలవిడిగా వినియోగించే పరిస్థితి రావడం దారుణమని లోక్ సత్తా ఉద్యమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ అన్నారు.
రాష్ట్రం వచ్చిన కొత్తలో లిక్కర్ ద్వారా ప్రభుత్వానికి రూ.10 వేల కోట్ల ఆదాయం ఉండేదని, ప్రస్తుతం అది రూ.42 వేల కోట్లకు తీసుకొచ్చారని గుర్తు చేశారు. లోక్‍సత్తా ఉద్యమ సంస్థ, జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండలో మీడియా సమావేశం జరిగింది.
జ్వాల అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ తో కలిసి ఆయన మాట్లాడుతూ, ప్రజల నుంచి వసూలు చేస్తున్న ఈ డబ్బులను తిరిగి ఏ విధంగా వినియోగిస్తున్నారో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. రాజకీయ, ఎన్నికల సంస్కరణలకుతోడు న్యాయ, పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు అమలు చేసినప్పుడే ప్రజాస్వామ్య విలువలు మరింత బలోపేతమవుతాయని అభిప్రాయపడ్డారు.
నీటి ఎద్దడికి చర్యలు తీసుకోవాలి
గోదావరి, ప్రాణహిత నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపడం ద్వారా తాగు, సాగునీటి అవసరాలను తీర్చాలని మేధావులు సూచిస్తుంటే.. రాష్ట్ర సర్కారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జయప్రకాశ్ నారాయణ ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎల్‍నినో ప్రభావంతో నీటిఎద్దడి తలెత్తే ప్రమాదం పొంచిఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి, ప్రాణహిత నదుల్లో అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకుని తాగునీటి సమస్యను తీర్చాలని, ఈ దిశగా ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోవాలని అన్నారు.
రాజకీయంగా పరస్పర విమర్శలను పక్కనపెట్టి అఖిలపక్ష నేతలు, మేధావుల సూచనల మేరకు సమస్య పరిష్కరించాలన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు
బడ్జెట్‍తో ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లోకి రావడానికి కారకులెవరో జనాలు గ్రహించాలని, ఉద్యోగులు ఆలోచించాలన్నారు.
ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు యజమానులు కాదని..సేవకులనే విషయాన్ని మరవొద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే నెలానెలా జీతాల రూపంలో ఆదాయ వనరులన్నీ ఖర్చయితే..అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మిగలవని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో లోక్‍సత్తా రాష్ట్ర ప్రధాన సలహాదారు పర్చా కోదండరామారావు, రెండు తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త బండారు రామ్మోహనరావు పాల్గొన్నారు.
