వెలుగు స్పెషల్ : యూరప్‌‌‌‌ సంక్షోభం..సమూల మార్పులే పరిష్కారం! 

వెలుగు స్పెషల్ : యూరప్‌‌‌‌ సంక్షోభం..సమూల మార్పులే పరిష్కారం! 

పెరుగుతున్న ధరలు. మందగించిన వృద్ధి. రాజకీయ అస్థిరత. ఇంధన భద్రతపై ఆందోళనలు యూరప్‌‌‌‌ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న యూరప్‌‌‌‌ ప్రస్తుతం బహుముఖ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.  ఒకప్పుడు ఆర్థిక ప్రగతి, సామాజిక భద్రత,  ప్రజాస్వామ్య  స్థిరత్వానికి ప్రతీకగా నిలిచిన ఐరోపా దేశాలు నేడు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి.  యూరప్ ప్రజల్లో  రోజురోజుకూ అసంతృప్తి  పెరుగుతోంది.  పెరుగుతున్న జీవన వ్యయం, అందుబాటులో లేని గృహాలు,  ఇంధన అధిక ధరలు, ఉపాధిపై అనిశ్చితితో వారిలో అసంతృప్తి  పెల్లుబుకుతోంది. యూరప్‌‌‌‌  సంక్షోభం లక్షలలో ప్రజలను వీధుల్లోకి తీసుకొస్తున్నది. దేశాలను బట్టి సమస్యల తీవ్రత  మారుతున్నప్పటికీ,  ప్రజల ఆర్థిక భద్రతపై ఆందోళన మాత్రం ఉమ్మడిగా కనిపిస్తోంది.  

ఫ్రాన్స్‌‌‌‌ తీవ్రమైన ఆర్థిక, రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటుండగా, జర్మనీ పారిశ్రామిక పోటీతత్వం, ఇంధన భద్రత సమస్యలతో సతమతమవుతోంది. పోర్చుగల్‌‌‌‌, స్పెయిన్‌‌‌‌లలో గృహఅద్దెలు, ఇళ్ల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. ఇటలీలో ఆర్థిక అసంతృప్తి వ్యక్తమవుతుండగా, అల్బేనియాలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బెల్జియం, గ్రీస్‌‌‌‌లలో ప్రభుత్వవ్యయం, విద్యాఖర్చులు, ప్రజాసేవలకు సంబంధించిన అంశాలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ యూరప్‌‌‌‌ ఎదుర్కొంటున్న విస్తృత ఆర్థిక, సామాజిక సమస్యలకు అద్దం పడుతున్నాయి. 

మందగిస్తున్న ఆర్థిక వృద్ధి. పెరుగుతున్న ఆందోళనలు, యూరోపియన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ 2026 వసంతకాల ఆర్థిక అంచనాల ప్రకారం.. యూరోపియన్‌‌‌‌ యూనియన్‌‌‌‌ ఆర్థిక వృద్ధి 2025లో 1.5 శాతంగా ఉండగా 2026లో 1.1 శాతానికి మందగించనుంది. 2026 సెప్టెంబర్ నాటికి ద్రవ్యోల్బణం 3.8 శాతం, నిరుద్యోగం 6.1 శాతంగా  నమోదైంది.  అంటే 13.6 మిలియన్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ గణాంకాలు యూరప్‌‌‌‌ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల తీవ్రతను సూచిస్తున్నాయి. ఆర్థిక వృద్ధి కొనసాగడం మాత్రమే సరిపోదు. ఆ వృద్ధి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. ఉపాధి భద్రతను పెంచాలి. సామాన్యులకు జీవన వ్యయాన్ని భరించగలిగే పరిస్థితులను కల్పించాలి. దేశాలవారీగా చూస్తే సమస్యలు మరింత స్పష్టమవుతాయి. 

యూరోస్టాట్ సెప్టెంబర్ రెండో త్రైమాసిక గణాంకాలు ప్రకారం.. స్పెయిన్‌‌‌‌లో ద్రవ్యోల్బణం 4.9 శాతం, గ్రీస్‌‌‌‌లో 5 శాతం, పోర్చుగల్‌‌‌‌లో 3.6 శాతం, జర్మనీలో 3.3 శాతం, ఫ్రాన్స్‌‌‌‌లో 3.4 శాతంగా నమోదయ్యాయి. నిరుద్యోగం స్పెయిన్‌‌‌‌లో 10 శాతం, అల్బేనియాలో 8.3 శాతం, ఫ్రాన్స్‌‌‌‌లో 8.2 శాతం, గ్రీస్‌‌‌‌లో 7.4 శాతం, పోర్చుగల్‌‌‌‌లో 5.7 శాతం, జర్మనీలో 4 శాతంగా ఉన్నట్లు  గణాంకాలు  తెలియజేస్తున్నాయి.

రష్యా- ఉక్రెయిన్‌‌‌‌ యుద్ధ ప్రభావం

యూరప్‌‌‌‌ సంక్షోభానికి అంతర్జాతీయ పరిణామాలు కూడా కారణమవుతున్నాయి. రష్యా, - ఉక్రెయిన్‌‌‌‌ యుద్ధం సంప్రదాయ  ఇంధన సరఫరా వ్యవస్థలను దెబ్బతీసి ఇంధన భద్రతపై ఆందోళనలను పెంచింది. ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు పరిశ్రమల ఉత్పత్తి వ్యయాన్ని పెంచడంతోపాటు కుటుంబాల బడ్జెట్లపై భారాన్ని మోపాయి. రష్యా ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు యూరప్‌‌‌‌ ప్రయత్నించినప్పటికీ, చౌకగా, నిరంతరాయంగా ఇంధనాన్ని పొందడం ఇప్పటికీ కీలక సమస్యగానే ఉంది. మధ్యప్రాచ్యంలోని ఘర్షణలు కూడా ఇంధన ధరలు, ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని పెంచే ప్రమాదం కలిగిస్తున్నాయి. అదే సమయంలో అధిక వడ్డీరేట్లు, గృహరుణాలు, వ్యాపార పెట్టుబడులను ఖరీదైనవిగా మార్చాయి. యువతకు సొంత ఇల్లు కొనుగోలు చేయడం, ఆర్థికంగా స్థిరపడటం కష్టమవుతోంది. ప్రజల ఆదాయాలు పెరిగే వేగంకంటే  ఖర్చులు వేగంగా పెరిగితే ప్రభుత్వాలపై అసంతృప్తి పెరగడం సహజం.

అప్పుల భారం.. భవిష్యత్తుకు సవాలు

ప్రభుత్వాలపై పెరుగుతున్న అప్పుల భారం కూడా యూరప్‌‌‌‌ ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది. యూరోస్టాట్ సెప్టెంబర్ 2026 రెండో త్రైమాసిక గణాంకాల ప్రకారం యూరోపియన్‌‌‌‌ యూనియన్‌‌‌‌ రుణం - జీడీపీ నిష్పత్తి 82.9 శాతంగా ఉంది. గ్రీస్‌‌‌‌లో ఇది 140.8 శాతం, ఇటలీలో 139.9 శాతం, ఫ్రాన్స్‌‌‌‌లో 119.1 శాతం, బెల్జియంలో 110.2 శాతం, స్పెయిన్‌‌‌‌లో 101.4 శాతంగా పేర్కొనడమైనది. అధిక ప్రభుత్వ రుణాలు ఉన్న దేశాలకు ఆరోగ్యం, విద్య, పింఛన్లు, మౌలిక సదుపాయాలపై వ్యయం చేయడానికి ఆర్థిక వెసులుబాటు తగ్గుతుంది. మరోవైపు ప్రజల సంక్షేమ అవసరాలను తగ్గించడం కూడా రాజకీయంగా సులభం కాదు. ఈ పరిస్థితి యూరప్‌‌‌‌ ప్రభుత్వాలను  సంక్లిష్టమైన నిర్ణయాల ముందు నిలబెడుతోంది.

విధాన మార్పులే సరైన మార్గం

యూరప్‌‌‌‌ సంక్షోభం నుంచి బయటపడాలంటే తాత్కాలిక ఉపశమన చర్యలకే పరిమితం కాకుండా దీర్ఘకాలిక సంస్కరణలకు కూడా శ్రీకారం చుట్టాలి. సాంకేతికత, పరిశోధన, డిజిటల్‌‌‌‌, మౌలిక సదుపాయాలు, ఆధునిక తయారీ రంగాల్లో పెట్టుబడులను పెంచాలి. ఆవిష్కరణలకు, వ్యాపారాల అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్న నిబంధనలను సమీక్షించాలి. పర్యావరణ పరిరక్షణను విస్మరించకుండా పరిశ్రమల పోటీతత్వాన్ని బలోపేతం చేసే విధానాలను రూపొందించాలి. ఇంధన రంగంలో ఒకే సరఫరాదారుపై అధికంగా ఆధారపడకుండా వనరులను విస్తరించుకోవాలి. అందుబాటు ధరల్లో ఇంధనం లభించేలా అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయాలి. పునరుత్పాదక ఇంధన వనరులు, ఇంధన సామర్థ్యాన్ని పెంచే సాంకేతికతలకు ప్రాధాన్యమివ్వాలి. అమెరికాతో వాణిజ్య సంబంధాలు యూరప్‌‌‌‌కు కీలకమే అయినప్పటికీ సంప్రదాయ మార్కెట్లపై అతిగా ఆధారపడటం ప్రమాదకరం. ఆసియా, ఆఫ్రికా, ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో వాణిజ్య సంబంధాలను విస్తరించాలి. దీనివల్ల ఎగుమతులకు కొత్త అవకాశాలు లభించడంతోపాటు అంతర్జాతీయ వాణిజ్య వివాదాల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.

ఆర్థిక సంస్కరణలతో మార్పు తేవాలి

ఇళ్ల లభ్యతను పెంచడం, నైపుణ్య శిక్షణను మెరుగుపరచడం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ సేవలను బలోపేతం చేయడం వంటి చర్యలు కూడా అంతే ముఖ్యం. ఆర్థిక సంస్కరణలు ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పును తీసుకురావాలి. లేకపోతే ఆర్థికవృద్ధి గణాంకాలు ప్రజల అసంతృప్తిని తగ్గించలేవు. యూరప్‌‌‌‌ సంక్షోభం కేవలం ఆర్థిక మందగమనం కాదు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా తన విధానాలను,  సంస్థలను  పునర్నిర్మించుకోగలదా అన్నదానికి ఇది ఒక పరీక్ష. ఆర్థిక సంస్కరణలతోపాటు ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందడం, రాజకీయ ఏకాభిప్రాయాన్ని సాధించడం అత్యవసరం. ప్రజల సమస్యలను సానుకూల  ధోరణితో వినడం తొలి అడుగు. వాటికి పరిష్కారాలను చూపించడం తదుపరి బాధ్యత. యూరప్‌‌‌‌ నాయకత్వం ఈ రెండింటినీ సమర్థంగా నిర్వహించినప్పుడే ఆర్థిక స్థిరత్వం, సామాజిక సమన్వయం, అంతర్జాతీయ పోటీతత్వాన్ని తిరిగి బలోపేతం చేసుకోగలదు. 

వృద్ధాప్య జనాభా.. వలసలపై రాజకీయ విభేదాలు

యూరప్‌‌‌‌ను వేధిస్తున్న మరో దీర్ఘకాలిక సమస్య జనాభా మార్పు. జననాల రేటు తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరగడం వల్ల పింఛన్లు, వైద్యసేవలపై భారం పెరుగుతోంది. అదే సమయంలో అనేక రంగాల్లో కార్మికుల కొరత కనిపిస్తోంది. ఈ లోటును పూడ్చడంలో వలసదారులు కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ వారి సమర్థవంతమైన సమీకరణ, స్థానిక సేవలపై ఒత్తిడి, ఉద్యోగ అవకాశాలపై ప్రజల్లో ఆందోళనలు రాజకీయ విభేదాలకు దారితీస్తున్నాయి. ఈ అసంతృప్తిని కొన్ని మితవాద, జాతీయవాద రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. అయితే వలసదారులను మాత్రమే సమస్యలకు కారణంగా చూపడం సరైన పరిష్కారం కాదు. ఉత్పాదకత, నైపుణ్యాల కొరత,  పెట్టుబడుల లోపం, జనాభా మార్పులు వంటి అంతర్గత సమస్యలను కూడా ప్రభుత్వాలు పరిష్కరించాలి. వలస విధానాల్లో ఆర్థిక అవసరాలు,  చట్టబద్ధత,  సామాజిక సమన్వయం మధ్య సమతుల్యత అవసరం.

 డా. రాధ రఘురామపాత్రుని,
ట్రేడ్ అండ్‌‌‌‌ జియో పొలిటికల్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌  
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ 
[email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి. 
రచన 700 పదాలకు మించరాదు.