నేలకొండపల్లి బౌద్ధ స్తూపానికి మహర్దశ..రూ.4.26 కోట్లతో అభివృద్ధి పనులకు ప్లాన్

నేలకొండపల్లి  బౌద్ధ స్తూపానికి మహర్దశ..రూ.4.26 కోట్లతో అభివృద్ధి పనులకు ప్లాన్
  •     బుద్ధిస్ట్ టూరిజం సర్క్యూట్ లోకి చేర్చేందుకు త్వరలో మాస్టర్​ ప్లాన్​ 
  •     ఇటీవల స్తూపాన్ని సందర్శించిన విదేశీ బౌద్ధ బిక్షువులు
  •     మాస్టర్​ ప్లాన్ పై పలు సూచనలు చేసిన బౌద్ధ మతపెద్దలు

ఖమ్మం, వెలుగు:  ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాచీన బౌద్ధ క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి బౌద్ధ వారసత్వ, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దేశంలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రాల్లో టాప్​3లో నిలపడమే లక్ష్యంగా మాస్టర్​ప్లాన్​ను సిద్ధం చేస్తోంది. అభివృద్ధి పనుల ప్రణాళిక (మాస్టర్​ ప్లాన్​) రూపకల్పన కోసం తెలంగాణ డిపార్ట్ మెంట్ ఆఫ్​ హెరిటేజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి, బౌద్ధ ధర్మ నిపుణులు ఇ.శివనాగిరెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ ఉపేంద్ర రెడ్డి, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ లక్ష్మయ్య తదితరులతో కూడిన ఒక నిపుణుల కమిటీ (కోర్ టీమ్)ను ఏర్పాటు చేసింది. ఇటీవల కంబోడియా, థాయ్ లాండ్​ తో పాటు పలు దేశాలకు చెందిన బౌద్ధ బిక్షువులు నేలకొండపల్లి స్తూపాన్ని సందర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధ క్షేత్రం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై వారి సూచనలు, సలహాలను కూడా నిపుణుల కమిటీ సభ్యులు తీసుకున్నారు. నేలకొండపల్లి స్తూపాన్ని కేవలం ఒక భవన నిర్మాణంలా కాకుండా, బౌద్ధ ధర్మానికి గౌరవ సూచకంగా ఉండేలా ప్లాన్​ చేస్తున్నారు.  

చారిత్రక నేపథ్యం ఇదీ..

ఖమ్మం జిల్లా కేంద్రానికి 24 కిలోమీటర్ల దూరంలో ఈ బౌద్ధక్షేత్రం ఉంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద స్తూపంగా చెబుతుండగా, ఒకప్పుడు చాళుక్యుల కాలంలో బౌద్ధుల ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ ప్రాంతం విరాజిల్లినట్టు పురావస్తు శాఖ ఇక్కడ జరిపిన తవ్వకాల్లో బయటపడింది. ఈ స్తూపాన్ని క్రీస్తుశకం 2వ శతాబ్దానికి చెందినదిగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. నేలకొండపల్లి, ముజ్జుగూడెం మధ్య ఈ స్తూపాన్ని 1976లో గుర్తించారు. పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు జరపడంతో 106 అడుగుల వ్యాసం, 60 అడుగుల ఎత్తులో ఉన్న స్తూపం బయటపడింది. 

ఇక్కడి సమీప ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో బుద్ధుని పాలరాతి విగ్రహాలు, మట్టి పాత్రలు, మట్టి పూసలు, ఇక్ష్వాకులు, శాతవాహనుల కాలం నాటి నాణేలు, పంచలోహ విగ్రహాలు చాలా బయటపడ్డాయి. వీటన్నింటిని అధికారులు మ్యూజియంలో భద్రపరిచారు. ఇటీవల జరిపిన తవ్వకాలు 100 గదుల ఆరామాలు కూడా బయటపడ్డాయి. ప్రస్తుతం స్తూపం దగ్గర అభివృద్ధి పనులు చేయడంతో పాటు దేశంలోని బుద్ధిస్ట్ టూరిజం సర్క్యూట్ లో ప్రధానమైనదిగా దీన్ని తీర్చిదిద్దేలా మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. స్తూపాన్ని ఆనుకొని దాదాపు 650 ఎకరాల్లో ఉన్న బాలసముద్రం చెరువును కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారు. 

అభివృద్ధి ప్రణాళికలు ఇలా..

ప్రస్తుతం రూ.4.26 కోట్లతో బౌద్ధ స్తూపం దగ్గర అభివృద్ధి పనులు చేపడుతున్నారు. టూరిజం డెవలప్​ మెంట్ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో రూ.2.50 కోట్లతో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. యాదాద్రి థర్మల్ పవర్​ స్టేషన్, తెలంగాణ జెన్​ కో సీఎస్​ఆర్​ ఫండ్స్​ నుంచి మరో రూ.1.76 కోట్లతో ప్రాచీన బౌద్ధ విహారాలు, సమావేశ మందిరం, బౌద్ధ స్తూపం పరిరక్షణ, పునరుద్ధరణ పనులను చేపట్టనున్నారు. పురావస్తు కట్టడాల అసలు నిర్మాణ స్వరూపం, చారిత్రక ప్రాధాన్యత, నిర్మాణ శైలి దెబ్బతినకుండా శాస్త్రీయ పరిరక్షణ పద్ధతుల్లో ఈ పనులు చేపట్టేందుకు ప్లాన్​ చేస్తున్నారు. 

బాలసముద్రం చెరువు దగ్గర బోటింగ్ తో పాటు వ్యూపాయింట్ టవర్, మల్టీపర్పస్​హాల్, ధ్యానమందిరం, సైట్ మ్యూజియం, కేఫెటేరియా, యాంఫీ థియేటర్​, 24 కాటేజీలు, 20 పడకల డార్మెటరీ, స్టాఫ్ క్వార్టర్స్, కమ్యూనిటీ హాల్, ప్లే ఏరియా, థీమ్​ పార్క్​ ఏర్పాటు చేసేందుకు ప్లాన్​ చేస్తున్నారు. తవ్వకాల్లో బయటపడిన ఆరామాలను నాలుగైదు అడుగుల ఎత్తు గోడలతో నిర్మించి ఆ రోజుల్లో ఎలా ఉండేవో చూపించాలని నిర్ణయించారు. పురావస్తు ఆధారాలు ప్రాచీన కాలంలో నేలకొండపల్లి ప్రముఖ బౌద్ధ ధార్మిక, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లిందని తెలియజేస్తుండగా, ఈ చారిత్రక సంపదను శాస్త్రీయ పద్ధతిలో పరిరక్షిస్తూ భావితరాలకు అందించడంతోపాటు, దేశవిదేశాల బౌద్ధ యాత్రికులను ఆకర్షించేలా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.  

నేలకొండపల్లి బౌద్ధ స్తూపానికి ఇంటర్​నేషనల్​గా గుర్తింపు తెస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

నేలకొండపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని 3 శతాబ్దానికి చెందిన చారిత్రక బౌద్ధ స్తూపాన్ని, పరిసర ప్రాంతాలను అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. సోమవారం నేలకొండపల్లిలో మంత్రి కలెక్టర్ దివాకరతో కలిసి పర్యాటక సదుపాయాలు, బౌద్ధ స్థల సంరక్షణ, పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ దేశంలోని అతిపెద్ద బౌద్ధ స్తూపాల్లో ఒకటైన ఈ ప్రాంతంలో గతంలో పురావస్తు తవ్వకాల్లో అనేక చారిత్రక వస్తువులు లభించాయని తెలిపారు. 

బౌద్ధ కట్టడాలపై అవగాహన ఉన్న నిపుణులు, అధికారులతో సమావేశం నిర్వహించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. చారిత్రక ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం స్థానిక రైతు వేదికలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఎల్‌‌‌‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున రైతులు రెండో పంట వేయకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో హెరిటేజ్ శాఖ అధికారులు, ఆర్డీవో శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.